కథనం కన్నీళ్లు తెప్పించింది..

8 Jul, 2021 16:26 IST|Sakshi
సరుకులు, బియ్యం అందజేస్తున్న అంబేడ్కర్‌  సేవాసమితి బాధ్యులు 

సాక్షి, జనగామ(వరంగల్‌): సాఫీగా సాగుతోన్న జీవితంలో అనారోగ్యం చిచ్చుపెట్టింది. అల్లారుముద్దుగా తల్లిదండ్రుల ఆలనాపాలనలో పెరుగుతున్న చిన్నారులను ఆగం చేసింది. దంపతులిద్దరూ మృతి చెందడంతో అనాథలుగా మారిన పిల్లలు వృద్దాప్యంలో ఉన్న నానామ్మ వద్ద సేదదీరుతున్నారు.. ఇదే విషయమై ‘అన్నీ నానమ్మే’ శీర్షికన “సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో కొంతమంది దాతలు స్పందించారు. జిల్లాలోని నర్మెట మండలం హన్మంతాపూర్‌ గ్రామానికి చెందిన మైలాం రాజు, భార్య రజని మృతి చెందడంతో వారి సంతానం ఇద్దరు కుమారులు అనాథలైన వార్తకు స్పందించిన అంబేడ్కర్‌ సేవాసమితి సభ్యుడు రామిని హరీష్‌ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చాడు.

దీంతోపాటు సమితి ఆధ్వర్యాన మల్లిగారి రాజు, మంగ శంకర్, వంగ భీమ్‌రాజ్, ఎండీ అసిఫ్, గూడెపు పృథ్వి, దుబ్బాక వీరస్వామి బృందంతో కలిసి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల కిట్టు అందించారు. ఇదిలా ఉండగా.. అమ్మ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి తో పాటు సభ్యులు సైతం ఇద్దరు చిన్నారులకు తమవంతుగా సాయం అందజేస్తామని ప్రకటించారు.   

జాతీయ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలి
జనగామ: ఈ నెల10న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ నందికొండ నర్సింగారావు అన్నారు. జనగామ కోర్టును ఆయన బుధవారం సందర్శించి, మాట్లాడారు. జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు, పోలీసులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు.

కోర్టుకు హాజరు కానీ కక్షిదారులు పర్చువల్‌ విధానం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి, కొత్తగా ఏర్పాటు చేసి పోక్సో కోర్టును పరిశీలించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కె.జయ్‌ కుమార్, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ఉమాదేవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.అజయ్‌ కుమార్, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పృద్వీరాజ్, డి.టి, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కూరెళ్ల  శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు