వనపర్తి ఆవాజ్‌.. ఖమర్‌ రహమాన్‌ 

8 Mar, 2023 01:34 IST|Sakshi
పాటలు ఎడిటింగ్‌ చేస్తున్న ఖమర్‌ రహమాన్‌

గజ్జె కట్టి, పాట పాడి మహిళల్లో చైతన్యం.. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు 

సారా నిషేధం కోసం లక్ష సంతకాల సేకరణ 

సఖీ కేంద్రాల ద్వారా అణచివేత, వేధింపులకు గురవుతున్న వారికి కౌన్సెలింగ్‌ 

వీజేఎంఎస్‌ ఏర్పాటుతో 25 వేల మంది జీవితాల్లో వెలుగులు 

కమ్యూనిటీ రేడియోతో మరింత చైతన్యం రగిల్చే దిశగా అడుగులు..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఆమె అతి పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన సామాన్యురాలు. తల్లి అనారోగ్యం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆరో తరగతి చదువుతుండగానే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కుటుంబ భారంతో అనేక సమస్యలు ఎదుర్కొంది. అయితే చిన్నప్పట్నుంచే అభ్యుదయ భావాలు కలిగిన ఆమె ఎలాగైనా తనను తాను నిరూపించుకోవడంతో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు. సమాజంలో కట్టుబాట్లను దాటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. భర్త సహకారంతో పదో తరగతి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశారు.

అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గజ్జె కట్టి, పాట పాడుతూ దేశమంతా తిరిగారు. అంతేకాదు స్వయం ఉపాధి చూపడం ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జాతీయ స్థాయిలోనూ పేరు సంపాదించారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆవాజ్‌ వనపర్తి పేరిట కమ్యూనిటీ రేడియోను స్థాపించి అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌కు చెందిన ఖమర్‌ రహమాన్‌పై మహిళాదినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. 

150 గ్రామాలకు ఆవాజ్‌ వనపర్తి
రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వనితా జ్యోతి సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ఖమర్‌ రహమాన్‌ కమ్యూనిటీ రేడియో ప్రాధాన్యత గురించి తెలుసుకుని.. తానూ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారు. అనేకసార్లు ప్రయత్నించిన తర్వాత నాలుగేళ్లకు అనుమతి లభించింది. వీజేఎంఎస్‌ ఆవాజ్‌ 90.4 ఎఫ్‌ఎం రేడియో (ఆవాజ్‌ వనపర్తి) ఏర్పాటయ్యింది. 2018లో ప్రసారాలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం ఆవాజ్‌ వనపర్తి రేడియో కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఎకరా స్థలం కూడా కేటాయించింది. 

ఇందులో నుంచే బ్రాడ్‌ కాస్టింగ్‌ నడుస్తోంది. భవన నిర్మాణం పురోగతిలో ఉంది. ఇది పూర్తయితే రికార్డింగ్, బ్రాడ్‌కాస్టింగ్‌ ఒక్కచోట నుంచే జరుగుతుంది. ప్రస్తుతం వనపర్తి నుంచి 35 కిలోమీటర్ల మేర 150 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేకున్నా ఎఫ్‌ఎం కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఆవాజ్‌ వనపర్తి 90.4 ఎఫ్‌ఎం పేరుతో వెబ్‌ రేడియో కూడా అందుబాటులోకి తేగా.. దీనికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలు ఉండడం విశేషం.

రైతులు, మహిళల సమస్యలు పరిష్కారంపై నిపుణులతో కార్యక్రమాలు, జాతీయ నేతలు, మహానుభావుల జీవిత చరిత్ర, చారిత్రక ప్రాధాన్యం గల అనేక అంశాలతోపాటు ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు, పద్యనాటకాలు, మిమిక్రీ, చిన్నపిల్లల కార్యక్రమాలు, యూనిసెఫ్‌ ప్రోగ్రామ్‌లు ప్రసారంతో ఇది బహుళ ప్రజాదరణ పొందుతోంది.

ఇలా మొదలు.. 
నిరక్షరాస్యత, పేదరికం, వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు జిల్లాలో ప్రభుత్వం 1989లో అక్షర కిరణం పేరిట పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మహిళా అక్షరాస్యతను పెంపొందించడం.. పొదుపు అలవాటు చేసుకునేలా స్వయం సహాయక బృందాల (ఎస్‌ఎస్‌జీ) ఏర్పాటు కార్యక్రమాలు మొదలు పెట్టింది.

ఆయా కార్యక్రమాలకు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. పాటలు రాయడం, పాడడంతో పాటు గజ్జె కట్టి ఆడటంలోనూ ప్రావీణ్యమున్న ఖమర్‌ రహమాన్‌కు వెంటనే అవకాశం వచ్చింది. అంతే ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు. గజ్జె కట్టి, పాటపాడుతూ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 

ఒక్కో మెట్టు ఎక్కుతూ.. 
ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కల్చరల్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగిన ఖమర్‌ రహమాన్‌.. చిన్నమ్మ థామస్‌ సఖీ కేంద్రాల నిర్వహణ చేపట్టి సమాజంలో అణచివేత, వేధింపులకు గురవుతున్న ఎందరో మహిళలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సారా నిషేధం కోసం లక్ష సంతకాలు సేకరించి గవర్నర్‌కు సమర్పించి గుర్తింపు తెచ్చుకున్నారు. భూకంప బాధితులకు విరాళాల సేకరణతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

ఈ క్రమంలో మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం (వీజేఎంఎస్‌) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతులకు కంప్యూటర్, టైలరింగ్, మగ్గం వర్క్స్, సర్ఫ్, అగర్‌బత్తీల తయారీ తదితరాల్లో శిక్షణ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 

మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు.. 
దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోకు నాతో పాటు మొత్తం 614 మంది దరఖాస్తు చేశారు. ఇందులో నాకే అవకాశం అభించింది. సాంకేతికతను ఉపయోగించి సమాజానికి మరిం త మేలు చేయాలనే సంకల్పంతో దీన్ని స్థాపించా. ప్రస్తుతం ఈ రేడియోలో 18 మంది మహిళలు పని చేస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డులు వచ్చినా..డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ (డీఈఎఫ్‌) నుంచి మూడు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. త్వరలో ప్రతి గ్రామానికి 2 రేడియోల చొప్పున అందజేసి.. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. 
– ఖమర్‌ రహమాన్, ఆవాజ్‌ వనపర్తి రేడియో ఫౌండర్‌  

మరిన్ని వార్తలు