Medaram Jatara 2022: వనదేవతలకు జన హారతి.. ఉప్పొంగిన భక్తి పారవశ్యం

19 Feb, 2022 01:58 IST|Sakshi

మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉప్పొంగిన భక్తి పారవశ్యంతో మేడారం జనసంద్రమైంది. సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో మార్మోగింది. ‘మా సమ్మక్క తల్లి కో.. సారక్క తల్లి కో’అంటూ శివసత్తుల పూనకాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు వన దేవతలూ గద్దెలపై కొలువై ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరికాయలు.. తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు.

పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు నిండి పోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలను పూజించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 30లక్షల మందికిపైగా మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. మొత్తంగా దేవతలను దర్శించుకున్న వారి సంఖ్య కోటీ 10లక్షలు దాటిందని.. ఇంకా భక్తుల తాకిడి ఉందని తెలిపారు.

రోజురోజుకూ పెరిగిన రద్దీ
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ఈ నెల 16న మొదలుకాగా.. అంతకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడం మొదలైంది. రోజురోజుకూ సంఖ్య పెరుగుతూ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో మేడారం ‘క్యూ’లైన్లు కిక్కిరిసిపోయాయి. సాధారణ భక్తుల క్యూలైన్లతోపాటు వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లు కూడా కిలోమీటర్ల పొడవునా సాగాయి. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఉన్నరోజే దర్శించుకోవాలన్న తలంపుతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మ«ధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చారు. శనివారం దేవతల వన ప్రవేశం సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది.

పెరిగిన వీఐపీల తాకిడి 
మేడారం జాతరకు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీఐపీల తాకిడి పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకాసింగ్‌ తమ కుటుంబాలతో హెలికాప్టర్‌ ద్వారా మేడారం వచ్చారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి స్వాగతం పలికి.. వన దేవతల దర్శనం చేయించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, విప్‌ రేగా కాంతారావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్‌తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు దేవతలను దర్శించుకున్నారు. వీఐపీల రాకతో సాధారణ భక్తులు ఇబ్బందిపడ్డారు. 
(చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు)

నేడు దేవతలు వనంలోకి.. 
మేడారం జాతర శనివారం సాయంత్రం ముగియనుంది. వన దేవతలు సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల నుంచి వన ప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జాతర చివరిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకోనున్నారు. శుక్రవారం రాత్రికే లక్షల మంది మేడారానికి చేరుకున్నారు. మొత్తంగా గత జాతర కంటే ఈసారి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనుందని అధికారులు తెలిపారు. జాతరకు ముందుగా వచ్చిన దూరప్రాంతాల వారు తిరిగి బయలుదేరుతుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు మెల్లగా ఖాళీ అవుతున్నాయి.  

సీఎం పర్యటన రద్దు.. 
శుక్రవారం సీఎం కేసీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు వన దేవతలను దర్శించుకోవడానికి వస్తున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. మొదట ఉదయం 11.30 గంటలకు వస్తారని ప్రకటించినా.. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని చెప్పారు. సీఎం సెక్యూరిటీ విభాగం, వ్యక్తిగత కార్యదర్శులు ఉదయమే మేడారం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్‌ పర్యటన రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. 

మేడారానికి జాతీయ హోదా ఉండదు: కిషన్‌రెడ్డి
పండుగలకు ఎక్కడా జాతీయ హోదా ఉండదని, ఆ ప్రకారం మేడారం జాతరకు కూడా ఉండదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లకోసారి వైభవంగా జరిగే ప్రకృతి పండుగ ఇది. పండుగలకు జాతీయ హోదా ఎక్కడా లేదు. ఇదే క్రమంలో మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఉండదు. అయితే దేశవ్యాప్తంగా మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పిస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం కోసం రూ.45 కోట్లు నిధులు కేటాయించాం. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. నేను పర్యాటక మంత్రి అయిన తర్వాత రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ప్రజలు కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండాలని అమ్మలను కోరుకున్నా..’’అని తెలిపారు.  
(చదవండి: కరగని ‘గుండె’)

మరిన్ని వార్తలు