ఆ రోజు వీఐపీలకు అనుమతివ్వకండి 

28 Oct, 2021 01:18 IST|Sakshi

సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీరిన రోజు ఆంక్షలొద్దు 

మేడారం జాతరపై పోలీసు అధికారులకు ఆర్టీసీ సూచన 

గత ఉత్సవాల్లో నేతల తీరుతో అదుపుతప్పిన పరిస్థితి 

ఈసారి భక్తులను తరలించేవేళ బస్సులను ఆపేసే చర్యలొద్దని హితవు 

4500 బస్సులు నడపాలని ప్రాథమికంగా నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మేడారం.. శుక్రవారం.. సమ్మక్క, సారలమ్మ దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీ మరీ పెరిగిపోవటంతో దర్శించుకున్నవారిని వేగంగా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు అధికారుల సూచనతో ఆర్టీసీ బస్సులు బయలుదేరుతున్నాయి. నిమిషానికి 20 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు జరిగాయి.

కానీ అదే సమయంలో కొందరు వీఐపీలు వస్తున్నా రన్న సమాచారంతో పోలీసులు ప్రధాన రోడ్డుపైకి బస్సులను రాకుండా ఆపేశారు. అలా 2 గంటలపాటు బస్సులు నిలిచిపోవటంతో, ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. భక్తుల్లో అసహనం పెరిగింది. క్యూలైన్లు అదుపుతప్పాయి. అంతా గందరగోళం.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిలసలాటకు దారితీస్తుండగా... అతికష్టమ్మీద అధికారులు అదుపు చేశారు’’ఇది గత జాతరలో నెలకొన్న పరిస్థితి.. ఉన్నత స్థానాల్లో ఉండీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన రాజకీయ నేతలు, వారికి దారి ఇప్పించే అత్యుత్సాహంతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. ఏమాత్రం అదుపుతప్పి తొక్కిసలాట జరిగినా... పర్యవసానం భయంకరంగా ఉండేది.  

రద్దీని నివారించేందుకు ముందస్తు సన్నాహాలు...  
ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకూడదంటే, సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీరిన రోజు వీఐపీలకు అనుమతివ్వొద్దని.. ఆర్టీసీ, పోలీసు అధికారులకు సూచించింది. వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న మేడారం జాతరకు మెరుగైన రవాణా వసతి కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారులు భేటీ అయి గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఈసారి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈసారి 4500 బస్సులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రెండో వారంలో గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందులో శుక్రవారం ఇద్దరు దేవతలు గద్దెమీద ఆసీనులై సంయుక్తంగా దర్శనమిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆ సమయంలో అక్కడే ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో రద్దీ పెరుగు తుంది. దర్శనం ముగిసిన వారిని వీలైనంత వేగంగా అక్కడి నుంచి తరలించటం ద్వారా, రద్దీని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు.

ఇందుకోసం పెద్దమొత్తంలో బస్సులను సిద్ధంగా ఉంచి, నిమిషానికి కనీసం వేయి మందిని తరలించాలని నిర్ణయించారు. ఇది జరగాలంటే ప్రధాన రోడ్డు క్లియర్‌గా ఉండాలి. గత జాతరలో సరిగ్గా అదే సమయంలో వీఐపీలు వచ్చారు. సాధారణ భక్తుల రాకపోకలపై రెండుగంటలపాటు పోలీసులు ఆంక్షలు విధించారు.

అది సమస్యలకు కారణమైంది. ఈసారి ఆ కీలక తరుణంలో వీఐపీలు రాకుండా, వారు ముందుగానే దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు