కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం

25 Jul, 2020 08:35 IST|Sakshi

అత్యవసర ఆపరేషన్లూ వాయిదా 

ఆవేదన వ్యక్తం చేస్తున్న రోగులు 

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి 

అమీర్‌పేట: కరోనా బూచి చూపి ఇతర రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వవ్యవహరిస్తున్నారని, అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను సైతం వాయిదా వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాల బోధనా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్‌–19 వార్డులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని కూడా కేటాయించి సేవలందిస్తున్నారు. మిగతా విభాగాల ద్వారా ఈఎస్‌ఐ కార్డు లబ్ధిదారులకు చికిత్సలు అందించాల్సి ఉండగా.. వైద్యులు, అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు నామమాత్రంగా సేవలందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. 

రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి మందులతో సరిపెడుతూ కావాల్సిన వైద్య పరికరాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు.  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ఆనంద్‌కిషోర్‌ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఆసుపత్రిలో చేరాడు. కాలుకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా ఇప్పట్లో  శస్త్ర చికిత్స చేయలేమని, కొంత కాలం పాటు వాకర్‌ సాయంతో నడవాలని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వాకర్‌ కోసం ఆసుపత్రి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని కిషోర్‌ వాపోయాడు. దీంతో బెడ్డుకే పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. పడుకుంటే ఆయాసం వస్తోందని, ఇటీవల ఆసుపత్రి వెళ్లగా బెల్టు పెట్టుకోవాలని సూచించారన్నారు. వాకర్‌ ఇవ్వాలని కోరితే సరైన సమాధానం ఇవ్వడంలేదని, ఇక బెల్టు కోసం ఎవరిని అడగాలో అర్థం కావడం లేదన్నాడు. 15 ఏళ్లుగా ఈఎస్‌ఐకి డబ్బులు కడుతున్నామని, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరిన తమకు సకాంలో వైద్యం ఇవ్వకుంటే కార్డు ఉండి లాభం ఏమిటని కిషోర్‌ వాపోయాడు. ఆసుపత్రికి వచ్చే అనేక మంది రోగులు ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ బూచిని చూపి అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను వేయిదా వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు