హైదరాబాద్‌లో శాండోస్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ 

1 Feb, 2023 03:04 IST|Sakshi

దశలవారీగా 1,800 మందికి ఉద్యోగాలు

మంత్రి కేటీఆర్‌తో శాండోస్‌ ప్రతినిధులు భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కంపెనీ కార్యకలాపాలకు ‘విజ్ఞానపరమైన సేవలు’ (నాలెడ్జ్‌ సర్వీసెస్‌) అందించేందుకు హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్‌ సైన్సెస్‌ దిగ్గజ కంపెనీ ‘శాండోస్‌’ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో ఆరంభంలో 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, దశలవారీగా ఈ సంఖ్య 1,800కు పెరుగుతుందని శాండోస్‌ ప్రకటించింది.

కంపెనీ సీఈఓ రిచర్డ్‌ సెయినోర్‌ నేతృత్వంలోని శాండోస్‌ ప్రతినిధి బృందం మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో సమావేశమైంది. ఇప్పటికే హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో ఉన్న తమ ఆధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తామని, ఆటోమేషన్‌తో పనిచేసే ప్రపంచస్థాయి ప్రయోగశాలను ఏర్పాటుచేస్తా­మ­ని సంస్థ సీఈఓ ప్రకటించారు. హైదరాబాద్‌­లో లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ఉన్న అనుకూలత వల్లే  గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ­న్నారు. వేయికి పైగా మాలిక్యూల్స్‌ను కలిగిన తమ సంస్థ 10 బిలియన్‌ డాలర్ల ఆదా­యం పొందుతోందని శాండోస్‌ సీఈఓ తెలిపారు. 

నోవార్టిస్‌ స్థాయిలో శాండోస్‌ కార్యకలాపాలు: కేటీఆర్‌ 
హైదరాబాద్‌లోని వ్యాపార అనుకూలత, మానవ వనరుల లభ్యతతో లైఫ్‌ సైన్సెస్‌ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని శాండోస్‌ ప్రతినిధులతో భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్‌ హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద కార్యాలయం కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ శాండోస్‌ కూడా అదేస్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, భవిష్యత్తు ప్రణాళికలపై శాండోస్‌ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్‌ వివరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా­టు చేస్తున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీ శాండోస్‌ తరహా కంపెనీల పెట్టుబడికి గమ్యస్థానంగా ఉంటుందని, ఫార్మాసిటీలో తయారీ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించాలని కేటీఆర్‌ కోరారు. ఈ భేటీలో శాండోస్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ క్లేర్‌ డిబ్రూ హేలింగ్, డాక్టర్‌ వందనాసింగ్, నవీన్‌ గుల్లపల్లి, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రాష్ట్ర లైఫ్‌ సైన్సెస్‌ డైరక్టర్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు