డీఎస్సీ నిర్వహించాలి!

25 Mar, 2021 01:23 IST|Sakshi

 ఉపాధ్యాయుల ఖాళీలు పెరిగిపోయాయి

నాణ్యత పడిపోకుండా జూన్‌లోగా నియామకాలు పూర్తి చేయాలి

పద్దులపై చర్చలో అధికార, విపక్ష సభ్యుల సూచనలు

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్‌ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు.

మధ్యాహ్న భోజనం పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్‌ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ జర్నలి స్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు. టీఆర్టీ పోస్టులకు ఎంపి కైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు.

ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన దేవాలయ, వక్ఫ్‌ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచిం చారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్‌ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్‌ సూచించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు