బస్సెక్కితే...బాదుడే

7 Jan, 2022 07:24 IST|Sakshi

సాధారణ చార్జీలపై రెట్టింపు వసూళ్లు ఇప్పటికే భారీగా ముందస్తు బుకింగ్‌లు

డిమాండ్‌కు తగిన రైళ్లు లేక ‘ప్రైవేట్‌’ ప్రయాణం

ట్రావెల్స్‌ కార్లు, మినీ బస్సుల్లోనూ తరలింపు

నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన ఆర్టీఏ    

సాక్షి హైదరాబాద్‌: ఏటా అదే తంతు. అదే దోపిడీ. పండగొచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు లూటీ. కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్‌ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు సంక్రాంతి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ చార్జీలను అమాంతంగా పెంచేసి  ‘పండగ’ చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350  వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. చార్జీలను పెంచొద్దంటూ ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా నమోదైన బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రయాణికులకు టిక్కెట్‌ బుకింగ్‌ సదుపాయం కూడా ఉంది. అయినప్పటికీ  రవాణా అధికారులు మొక్కుబడి తనిఖీలకు పరిమితమవుతున్నారు.  

అడ్డగోలుగా..  
ఈ నెల 8 నుంచి 16 వరకు పిల్లలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఏపీలో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సొంత ఊరుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి.  
కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్న  ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి.  

రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్‌లోనూ ముందస్తు బుకింగ్‌లకు డిమాండ్‌ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు సాధారణ రోజుల్లో రూ.900 వరకు ఉంటే ఇప్పుడు  రూ.1600పైనే తీసుకుంటున్నారని కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సొంతంగా కారు బుక్‌ చేసుకొని వెళ్లాలన్నా, కొంతమంది  ప్రయాణికులు మినీ బస్సు బుక్‌ చేసుకోవాలనుకున్నా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు  ఖర్చవుతుంది. ‘సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరెళ్లాలని ఉంది. కానీ  నలుగురం వెళ్లి, తిరిగి రావడానికి చార్జీలే రూ.10 వేలు దాటేటట్లుంది’ అని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన వివేక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆర్టీసీ 4,318 అదనపు బస్సులు..
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు  అందుబాటులో  ఉంటాయి. ఏపీలోని దూరప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులకు  550  బస్సుల్లో రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్‌ భవన్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ఇవి నడుస్తాయి.  

మరిన్ని వార్తలు