ఆదర్శ గ్రామాల్లో దేశంలోనే జిల్లా టాప్‌

27 Apr, 2022 22:33 IST|Sakshi
పాల్దా గ్రామంలో పరిశుభ్రంగా ఉన్న ఓ కాలనీ

కేంద్ర ప్రభుత్వ సంసద్‌ ఆదర్శ్‌

గ్రామీణ యోజన వెబ్‌సైట్‌లో వెల్లడి 

తెలంగాణలో అత్యధికంగా నాలుగు గ్రామాలు జిల్లా నుంచే.. 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ‘సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన’ కింద ప్రకటించిన గ్రామాల్లో నిజామాబాద్‌ జిల్లా దేశంలోనే టాప్‌గా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్‌సైట్‌లో వివరాలు పేర్కొంది. దేశంలోనే మొదటి పది స్థానాల్లో తెలంగాణకు చెందిన గ్రామాలే నిలిచాయి. వీటిల్లో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నుంచి ఏకంగా నాలుగు గ్రామాలు నిలవడం గమనార్హం. జిల్లాలోని నిజామాబాద్‌ రూరల్‌ మండలం పాల్దా గ్రామం 90.95 స్కోర్‌తో దేశంలో 3వ స్థానంలో, నందిపేట మండలం వెల్మల్‌ 90.49 స్కోర్‌తో 6వ స్థానంలో, మోపాల్‌ మండలం తానాకుర్దు 90.03 స్కోర్‌తో 8వ స్థానంలో, వేల్పూర్‌ మండలం కుక్‌నూర్‌ 90.28 స్కోర్‌తో 9వ స్థానంలో నిలిచాయి. 

అయితే పార్లమెంట్‌ సభ్యులు తమ నియోజకవర్గాలు, రాజ్యసభ సభ్యులు దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన. ఈ పథకం కింద ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది. ఆదర్శ గ్రామాల ప్రజలకు కలెక్టర్‌ నారాయణరెడ్డి అభినందనలు తెలిపారు.

జిల్లాకు గర్వకారణం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 
ఇందూరు: సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన కింద ఎంపికైన ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో పది గ్రామాలుండగా, ఇందూరు జిల్లాలోనే నాలుగు గ్రామాలుండడం నిజామాబాద్‌కు గర్వకారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లనే సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు కేటాయించడం వలన అభివృద్ధి పనులు జరిగాయని, ఇందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లకు, జిల్లా అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు