సర్పంచ్‌ ఒకరు.. అనుమతులిచ్చేది మరొకరు

3 Aug, 2020 08:01 IST|Sakshi
సర్పంచ్‌ కుమారుడు తన సంతకంతో ఇచ్చిన అనుమతి పత్రం 

సాక్షి, కాటారం: సర్పంచ్‌ల అమాయకత్వాన్ని వారి కుటుంబ సభ్యులు ఆసరగా చేసుకుంటున్నారు. ప్రజల ఓట్లతో గెలిచింది ఒకరైతే.. పాలన మాత్రం వారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే కొనసాగుతున్నదని అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధి పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల కంటే వారి పతులు, కూమారులదే పెత్తనం కొనసాగుతోంది. గ్రామపంచాయతీ పాలనా పరమైన.. అలాగే ఎలాంటి అనుమతులైనా వారి నుంచి రావాల్సిదే. మండలంలోని ఓ గ్రామపంచాయతీ నుంచి మరో ప్రాంతానికి దుక్కిటెద్దులు తీసుకెళ్లడానికి ఆ జీపీ సర్పంచ్‌ కుమారుడు ఇచ్చిన అనుమతి పత్రం వివాదాస్పదంగా మారింది. దుక్కిటెద్దులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ కార్యదర్శికి మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది.

కానీ సదరు సర్పంచ్‌ కుమారుడు నిబంధనలను తుంగలో తొక్కి సర్పంచ్, గ్రామపంచాయతీ పేరిట ఉండే లెటర్‌ ప్యాడ్‌పై అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా సర్పంచ్‌కు బదులుగా సర్పంచ్‌ కుమారుడే తన సంతకం చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇలా సర్పంచ్‌లను పక్కన పెట్టి కుటుంబ సభ్యులు పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డిని “సాక్షి’ వివరణ కోరగా అనుమతి ఇచ్చే అధికారం సర్పంచ్‌కు ఉండదన్నారు. గ్రామపంచాయతీకి లెటర్‌ ప్యాడ్‌ లాంటివి ఉండవని, సర్పంచ్‌ పేరితో ఇచ్చిన అనుమతి లేఖతో జీపీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు