ఇదెక్కడి గోల.. ఈ భారం మోయలేం..

16 Oct, 2022 09:12 IST|Sakshi

కరీంనగర్‌: గ్రామపంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. కనీసం కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇవే తలకుమించిన భారమైతే.. సర్పంచ్‌లపై ట్రాక్టర్ల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఇచ్చిన ట్రాక్టర్ల కిస్తీలు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి ఒక్క రూపాయి కూడా రావడంలేదు. దీంతో పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. 

తలలు పట్టుకుంటున్న సర్పంచ్‌లు
జిల్లాలో 16 మండలాల పరిధిలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్త పంచాయతీలు 57 ఉన్నాయి. అయితే.. చాలా పంచాయతీలకు ఆదాయ వనరులు తక్కువ. దీంతో సిబ్బందికి జీతాల చెల్లింపు భారంగా మారిందని సర్పంచ్‌లు చెబుతున్నారు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. 

  • గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన వివిధ బాధ్యతలు నిర్వహించేందుకు పలువురు సిబ్బంది అవసరం. పంచాయతీ వ్యవహారాలు చూసేందుకు కారోబార్‌తో పాటు పన్నుల వసూళ్లకు బిల్‌ కలెక్టర్, వాటర్‌ ట్యాంక్‌లు, బోర్ల నిర్వహణ, తాగునీటి సరఫరా పనులు చూసేందుకు వాటర్‌మెన్, వీధిలైట్ల మెయిన్‌టనెన్స్‌ కోసం ఎలక్ట్రిషియన్, పారిశుధ్య పనులు, చెత్త సేకరణ సఫాయి కార్మికులు అవసరం ఉంటారు. పంచాయతీ ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవర్లు అవసరం ఉంటుంది. 
  •  ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించకపోవడంతో పంచాయతీ సిబ్బందిలో నుంచి ఒకరిని డ్రైవర్‌గా నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సర్పంచ్‌లు అనుభవం లేని వారిని డ్రైవర్లను నియమించుకున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు. 
  • ప్రస్తుతం పంచాయతీ స్థాయి జనాభాను బట్టి సిబ్బంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి రూ.5 వేల నుంచి రూ.3 వేల వరకు వేతనాలు ఉన్నాయి. జీతాలు వ్యయం తక్కువగానే ఉండడంతో పంచాయతీలు భరిస్తున్నాయి. మల్టీపర్పస్‌ వర్కర్లకు జీతాలు నెలకు రూ.8,500 చెల్లించాల్సి ఉండడంతో సర్పంచ్‌లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. 

500 జనాభాకు ఒకరు..
పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇదివరకు ఉన్న గ్రామపంచాయతీలను పునర్‌ వ్యవస్థీకరించి కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆమ్లెట్‌ గ్రామాలు, గిరిజన తండాలు కొత్త జీపీలుగా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో వివిధ పనులు నిర్వహించేందుకు గాను గ్రామపంచాయతీలో 500 జనాభాకు ఒకరి చొప్పున మల్టీపర్పస్‌ వర్కర్లను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ప్రతీ పంచాయతీకి కనీసం ఇద్దరు మల్టీపర్పస్‌ వర్కర్లు ఉండాలని సూచించింది. 500 వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 10 ఉన్నాయి. 3 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 244 ఉన్నాయి. 3 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 59 ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1800 నుంచి 2000 మందికిపైగా మల్టీపర్పస్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామాల్లో ట్రాక్టర్‌ డ్రైవింగ్, మురికికాలువలు తీయడం, బల్బులు పెట్టడం, వాటర్‌ సమస్యలను పరిశీలించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. 

చిన్న పంచాయతీల్లో గందరగోళం 
జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 57 గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ట్రాక్టర్‌ కిస్తీ నెలకు రూ 16,000, పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.17,000, ట్రాక్టర్‌ మరమ్మ తు ఖర్చులు రూ.2,500, డీజిల్‌ ఖర్చు రూ.8,000 చొప్పున నెలకు రూ.43,000 ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి చిన్న పంచాయతీలకు వచ్చే నిధులు రూ.85 వేలు మాత్రమే. మిగితా రూ.42 వేల నుండి పారిశుధ్య కార్మికులకు, వీధి లైట్లకు, ఇతరాత్ర వాటికి ఉపయోగించాలి.  

ప్రభుత్వమే భరించాలి
ఇప్పటికే పంచాయతీలకు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చుడే కష్టంగా ఉంది. ట్రాక్టర్‌ నిర్వహణ, మల్టీపర్సస్‌ వర్కర్ల వేతనాలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు ఇతరాత్ర ఖర్చుల కోసం నానా తంటాలు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తే వాటిని స్థానికంగా అభివృద్ధి పనులకు వినియోగించుకోనే అవకాశం ఉంటుంది. తలకు మించిన భారంగా తయారైన ట్రాక్టర్‌ నిర్వహణను ప్రభుత్వమే భరించాలి. 
– ఉప్పుల రాధమ్మ, గోలిరామయ్యపల్లె సర్పంచ్, రామడుగు 

(చదవండి: రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్‌ బాధితులు )

మరిన్ని వార్తలు