ప్రశ్నపత్రం లీకేజీలో ప్రశ్నలెన్నో..!

25 Aug, 2021 01:31 IST|Sakshi

సాక్షి కథనాలతో పోలీసు దర్యాప్తు ముమ్మరం

తొలిరోజు 11 మందిని పిలిపించిన పోలీసులు  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/శాతవాహన యూనివర్సిటీ:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహా రం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయం లో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాలతో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.   వర్సిటీ అధికారులు అందజేసిన సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పేపర్‌ లీకైన ఫొటోల్లోని ఓ ఫొటోను ‘సాక్షి’ సంపాదించింది.

17వ తేదీన ప్రశ్నపత్రం రాగానే ఇంకా డౌన్‌లోడ్‌ చేయకముందే.. ఓ కాలేజీ సిబ్బంది నేరుగా కంప్యూటర్‌ మానిటర్‌తో సహా ఫొటో తీసి పంపారు. కంప్యూటర్‌లో ప్రశ్నపత్రం ఫొటో తీసే క్రమంలో సిరిసిల్లలోని ఓ డిగ్రీ కాలేజీ కోడ్, పేరు ఉన్న డీఫామ్‌ (విద్యార్థుల హాల్‌టికెట్లు, వివరాలు తెలిపే పత్రం) కూడా ఈ ఫొటోకు చిక్కింది. దీంతో సిరిసిల్లలోని సదరు డిగ్రీ కాలేజీ నుంచే పేపర్‌ లీకైందని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. 

ఎవరెవరి పాత్ర ఎంతెంత... 
ఈ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రం రూపొందించినప్పటి నుంచి ప్రిన్సిపాల్‌కు అక్కడ నుంచి విద్యార్థులకు చేరేవరకు ఎవరెవరి పాత్ర ఉందో తేల్చనున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ మొత్తం ఏడు జిల్లాల పరిధిలో  98 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 55 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా 55 మందిని ప్రశ్నించాలని పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాబితా కూడా సిద్ధం చేశారు. తొలిరోజు విచారణ కోసం 11 మందిని  పిలిపించి వారి వివరాలు నమోదు చేసుకుని, నోటీసులు ఇచ్చి పంపారు.

ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్న.. తొమ్మిది సెల్‌ఫోన్లకు సంబంధించిన కాల్‌ డేటా రికార్డ్స్‌ (సీడీఆర్‌)ను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా అనుమానితుల జాబితాను రూపొందిస్తున్నారు. ఈ తొమ్మిది సెల్‌ఫోన్లలో డేటా సేకరణ కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపారు. పరీక్షలు జరిగిన ప్రతి కాలేజీ నుంచి విద్యార్థుల హాల్‌టికెట్లు, అటెండెన్స్‌ వివరాలు, సీసీ ఫుటేజీ, డీఫామ్స్‌ తదితర వివరాలను తెప్పిస్తున్నారు. ఈ కేసుపై కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఏసీపీ తుల శ్రీనివాస్, టూటౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ తోట మహేశ్‌తో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశారు. తొలుత 55 మందికి నోటీసులు ఇచ్చి విచారించిన అనంతరం మిగిలిన పాత్రధారులను  ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు