మెదక్: ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

28 Jun, 2022 12:40 IST|Sakshi

మెదక్ : నర్సాపూర్‌లోని ఓ ఎస్‌బీఐ శాఖలో కొంతమంది ఉద్యోగులు బ్యాంకు డబ్బును దుర్వినియోగం చేశారని ఆడిట్‌లో తేలినట్లు తెలిసింది. దుర్వినియోగంపై ఆరోపణలు రాగానే బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిటర్లను పంపి ఈనెల 21న అర్ధరాత్రి వరకు ఆడిట్‌ చేయించారు.  ఈ నెల 22 న బ్యాంకులో, ఏటీఎంలలో అన్ని లావాదేవీలను నిలిపి వేసి ఆడిట్‌ చేయించారు.

 బ్యాంకుతోపాటు పట్టణంలోని మూడు ఏటీఎంలలో విచారణ చేశా రు. బ్యాంకులో, ఏటీఎంలలో సుమారు నాలుగు రోజుల పాటు ఆడిట్‌ చేయగా సుమారు 5 కోట్ల 20లక్షల రూపాయలకు లెక్కలు తేలకపోవడంతో ఈ మేరకు డబ్బులు గోల్‌మాల్‌ అయినట్లు ఆడిటర్లు ఒక అంచనాకు వచ్చారని తెలిసింది.  బ్యాంకులో రుణాల కోసం తనఖా పెట్టిన బంగారం ఖాతా లను, రుణం కోసం పెట్టిన బంగారు నగలను పరిశీలించాల్సి ఉందని తెలిసింది. దుర్వినియోగంలో భాగంగా  ప్రాథమికంగా ఒక ఉద్యోగిని ఇప్పటికే విధుల నుంచి తొలగించారని తెలిసింది.

 బ్యాంకులో డబ్బుల గోల్‌మాల్‌పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని బ్యాంకు ఉన్నతాధికారులు ఓ దర్యాప్తు సంస్థకు ఇటీవల ఫిర్యాదు చేశారని తెలిసింది. బ్యాంకులో డబ్బులు దుర్వినియోగం అయినట్లు వస్తున్న ఆరోపణలతో పాటు ఆడిట్‌ వివరాలు తెలపాలని స్థానిక ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌ నర్సయ్యను కోరగా ఆయన తనకేమి తెలియదని చెప్పారు. బ్యాంకులో ఆడిట్‌ పూర్తయిందని,  ఆడిట్‌ను తమ బ్యాంకు ఉన్నతాధికారులు పర్యవేక్షించారని, తనకు ఎలాంటి  వివరాలు తెలియవని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు