ప్లాట్‌ కేటాయింపు సక్రమమే.. రవీంద్రనాథ్‌కు మళ్లీ చుక్కెదురు!

2 Apr, 2023 08:43 IST|Sakshi

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరికి క్లీన్‌చిట్‌ 

ప్రస్తుత అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు 

ప్లాట్‌ కేటాయింపు సక్రమమే అన్న న్యాయస్థానం

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్లాట్‌ కేటాయింపును తప్పుబడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే మిగిలింది. ఓ ప్లాట్‌ కేటాయింపునకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో సీహెచ్‌ శిరీషకు 853 ఎఫ్‌ ప్లాట్‌ కేటాయించారు. ఈ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని హైకోర్టు కూడా హౌసింగ్‌ సొసైటీని ఆదేశించింది.

ఈ మేరకు 2020లో అప్పటి పాలకవర్గం ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే, 2021 మార్చి నెలలో హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్లాట్‌ అంశాన్ని తెరపైకి తెచి్చన రవీంద్రనాథ్‌.. ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు, ఇది సివిల్‌ ఇన్‌ నేచర్‌ అంటూ కోర్టుకు క్లోజర్‌ రిపోర్ట్‌ను సమర్పించారు. ఆ తర్వాత కేసును రీ ఓపెన్‌ చేయాలంటూ నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో రవీంద్రనాథ్‌ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానం కేసును రీ ఓపెన్‌ చేసింది.  

కాగా, కేసును మళ్లీ తెరవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పటి జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి హనుమంతరావు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యదర్శిగా ఉన్న రవీంద్రనాథ్‌ స్థానంలో రాజేశ్వరరావు ఎన్నికైనందున ఈ కేసుతో రవీంద్రనాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని హనుమంతరావు వినిపించిన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ కేసు తీర్పులో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. కోర్టును వ్యక్తిగత దూషణలకు వేదికగా మార్చుకోవద్దని హెచ్చరించింది. అసలు రవీంద్రనాథ్‌కు ఫిర్యాదు చేసే హక్కు లేదని తేల్చి చెప్పింది.

 హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రవీంద్రనాథ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై రవీంద్రనాథ్‌ ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈడీ విచారణపై గతంలో హైకోర్టు స్టే విధించగా.. ఆ తర్వాత ఈడీ ఈసీఐఆర్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి క్రిమినల్‌ కోర్టు కూడా నిందితులపై ఉన్న కేసులను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రవీంద్రనాథ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను సమరి్థస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు నరేంద్రచౌదరికి క్లీన్‌చిట్‌ లభించింది. నరేంద్ర చౌదరిపై రవీంద్రనాథ్‌ మోపిన అభియోగాలన్నీ వీగిపోయా యి.  ఆదివారం జరిగే జూబ్లీహిల్స్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం పర్యవేక్షణకు అధికారిని నియమించాలని సహకార సంఘాల కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు