న్యాయ సమీక్షకు ఐదో షెడ్యూలు అతీతం

12 Feb, 2021 02:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనులకు నూటికి నూరు శాతం రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలులో పేరా 5(1)ను అనుసరించి జారీ చేసే ఏ నోటిఫికేషన్‌ అయినా న్యాయ సమీక్షకు అతీతమని ఆధార్‌ సొసైటీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను రివ్యూ పిటిషన్‌గా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐదో షెడ్యూలును అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్‌ పోస్టుల్లో గిరిజనులకు నూటికి నూరు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ 2000 జనవరి 10న జారీచేసిన జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేయజాలదని నివేదిస్తూ ఆధార్‌ సొసైటీ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సొసైటీ తరఫు న్యాయవాదు లు అల్లంకి రమేశ్, హన్మంతరెడ్డి పిటిషన్‌ ఫైల్‌ చేశారు.

గురువారం ఈ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సొసైటీ తరఫు న్యాయవాది ఎంఎన్‌ రావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ అంశాన్ని సమీక్షించేందుకు ఇతర మార్గాలు ఉండగా.. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని ప్రశ్నించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు రిట్‌ పిటిషన్‌ను రివ్యూ పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకునేందుకు ధర్మాసనం సమ్మతిస్తూ.. ఇదే అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లకు జత చేసింది. ఈ రివ్యూ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. 

మరిన్ని వార్తలు