సింగరేణిలో మరో విద్యుత్‌ ప్లాంటు

9 Apr, 2022 02:40 IST|Sakshi

ఇకపై సింగరేణిలో 95 శాతంఉద్యోగాలు స్థానికులకే 

మందమర్రిలో పేలుడు పదార్థాల ప్లాంటు 

బోర్డు సమావేశంలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌/జైపూర్‌(చెన్నూర్‌): సింగరేణి బొగ్గు గనుల సంస్థ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నెలకొల్పిన 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు అదనంగా అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు. దీనికి సం బంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను శుక్రవారం సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం ఆమోదించింది.

రూ.6,790 కోట్ల అంచనా వ్య యంతో విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు. ప్రస్తుత 1200 మెగావాట్ల ప్లాంట్‌తో ఏటా రూ.500 కోట్ల లాభాలు సమకూరుతున్నాయని, ఈ కొత్త యూనిట్‌ కూడా సంస్థ ఆర్థిక సుస్థిరతకు దోహదపడుతుందని శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ఆర్థిక, ఇంధనశాఖ ల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్టర్లుగా వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ సీఎండీ మనోజ్‌ కుమార్, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్లు పీ ఎస్‌ఎల్‌ స్వామి, వి.కె.సోలంకి పాల్గొన్నారు. 

మరిన్ని బోర్డు నిర్ణయాలు 
►స్థానికతపై రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా సింగరేణి సంస్థలో కూడా ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అంగీకారం 
►సింగరేణి విస్తరించిన నాలుగు ఉమ్మడి జిల్లా ల వారికి అధికారేతర ఉద్యోగాల్లో 80 శాతం, అధికారుల ఉద్యోగాల్లో 60 శాతం స్థానిక రిజర్వేషన్‌ వర్తింపజేస్తుండగా, ఇకపై రెండు కేటగిరీల్లోనూ 95 శాతానికి పెంచారు. ఎగ్జిక్యూటివ్, ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే లభిస్తాయి. ఐదు శాతాన్ని ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు.  
►సింగరేణి ఉద్యోగులకు యూనిఫాం పంపిణీకి స్టేట్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా రూ.2 కోట్లతో వస్త్రాల కొనుగోళ్లకు ఆమోదం. 
►ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన పేలుడు పదార్థాల సరఫరా కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌తో కలిసి మందమర్రి వద్ద 50 వేల టన్ను ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం. మణుగూరు, రామగుండం ఏరియాల్లో గల 50 వేల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ల సామర్థ్యం లక్ష టన్నులకు పెంపు 

మరిన్ని వార్తలు