పేపర్‌ లీకేజీ కేసు: టీఎస్‌పీఎస్పీలో ముగిసిన సీన్ రీకన్‌స్ట్రక్షన్‌.. రెండు కంప్యూటర్‌లు సీజ్‌

18 Mar, 2023 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్‌. ఇందులో భాగంగా.. నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కి దిగింది. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి ఏ1 ప్రవీణ్‌, ఏ2 రాజశేఖర్‌లను శనివారం మధ్యాహ్నం కస్టడీకి తీసుకుని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి తరలించింది. 

పేపర్‌ లీకేజీ కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా.. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను నేరం జరిగిన తీరును అడిగి తెలుసుకుంది సిట్‌. టీఎస్‌పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ రూంలోకి వాళ్లిద్దరినీ తీసుకెళ్లి అధికారులు విచారించారు. ఆ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి కంప్యూటర్‌ను నిందితుల సమక్షంలోనే పరిశీలించారు పోలీసులు. ఈ సిస్టమ్‌ నుంచే పేపర్‌ లీక్‌ కావడంతో..  అక్కడే వాళ్లను విచారించింది.   

టెక్నికల్‌ విషయాలపై ఆరా తీసిన అధికారులు..  శంకర్ లక్ష్మి, ప్రవీణ్‌, రాజశేఖర్‌ సంబంధాలపై ఆరా తీశారు.  అలాగే ఐపీ అడ్రస్‌లు మార్చేసి.. కంప్యూటర్ లోకి ఎలా చొరబడ్డారని విషయాలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలంలో వీళ్లిద్దరినీ విచారించాక.. ప్రధాన నిందితులిద్దరినీ హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి తరలించారు అధికారులు.

ఇక టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచి రెండు కంప్యూటర్‌లను అధికారులు స్వీధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పేపర్ల లీకేజీ కేసులో నిందితులను ఆరు రోజుల సిట్‌ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్త: పేపర్‌ లీక్స్‌ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు