రూ.7.45కే రుచీ, శుచీ ఎలా?

23 Jul, 2022 02:40 IST|Sakshi

మధ్యాహ్న భోజనం మార్గదర్శకాలపై హెచ్‌ఎంల పెదవి విరుపు 

విద్యార్థికి రూ. 7.45 ఎలా సరిపోతుందనే ప్రశ్న 

భోజనానికీ తమనే బాధ్యులను చేయడం సబబు కాదని ఆవేదన 

ఇచ్చేది తక్కువ... క్వాలిటీ ఎక్కువెలా? అని నిలదీత  

అదనపు బాధ్యతలతో బోధన పర్యవేక్షణ దెబ్బతింటుందంటున్న ప్రధానోపాధ్యాయులు 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యాశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు తలనొప్పిగా మారాయని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యతకు స్కూల్‌ హెచ్‌ఎంలనే బాధ్యులను చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు తనిఖీ సమయంలో సరైన లెక్క చెప్పకపోయినా హెచ్‌ఎంలపైనే చర్య తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

బాసర ట్రిపుల్‌ఐటీలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హెచ్‌ఎంల్లో మరింత కంగారు మొదలైంది.  మార్కెట్లో నిత్యావసరాలు మండిపోతుంటే, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటితే నిబంధనల ప్రకారం నాణ్యత ఎలా సాధ్యమనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భోజనం ఎంత మందికి పెట్టామనే వివరాలను అధికారులకు పంపాలని కోరడం పెద్ద తలనొప్పి అని చెబుతున్నారు. దీనివల్ల బోధన పర్యవేక్షణ దెబ్బతింటుందని వాపోతున్నారు. 

ప్రతిబంధకంగా నిబంధనలు 
రాష్ట్రవ్యాప్తంగా 24 వేల బడుల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.7.45 మాత్రమే ఇస్తారు. స్థానిక మహిళా సంఘాలకు స్కూల్‌ నుంచి బియ్యం మాత్రమే ఇస్తారు. మిగతావన్నీ వాళ్ళే కొని తెచ్చుకోవాలి. 
దీనికి రూ.7.45 ఏమేర సరిపోతాయని మహిళా సంఘాలు అంటున్నాయి. అదీగాక వారానికి మూడు గుడ్లు ఇవ్వాలి. అలాంటప్పుడు కూరలు, ఇతర వంట సామగ్రి ఎలా సమకూర్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పప్పులు, నూనెలు ఏ రోజుకారోజు పెరిగిపోతుంటే, ఆ మొత్తంతో ఎలా సర్దుకోవాలని నిలదీస్తున్నారు.  
తక్కువ ఖర్చుతో తెచ్చే కూరల్లో కొన్ని చెడిపోయి ఉంటే వాటికి తమను ఎలా బాధ్యులను చేస్తారని హెచ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు.  
ప్రతి రోజూ మెనూ వివరాలను స్కూల్‌ గోడపై రాయాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఈ వివరాలు సరిగా లేకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటారు. ఈ మెనూ రాయాలంటే సమయం వృథా అవుతుందని హెచ్‌ఎంలు అంటున్నారు. 
పాఠశాల విద్యా కమిటీ, విద్యార్థులతో కూడిన కమిటీ సమక్షంలోనూ బియ్యం తూకం వేసి వంట చేసే వారికివ్వాలనే షరతు పెట్టారు. ఈ లెక్కలన్నీ రిజిష్టర్‌లో పక్కాగా పేర్కొనాలి. వంట పాత్రలు శుభ్రంగా లేకపోయినా, విద్యార్థులు భోజనం చేసే ప్లేట్లు అపరిశుభ్రంగా కన్పించినా దానికీ స్కూల్‌ హెచ్‌ఎందే బాధ్యతని నిబంధనల్లో పేర్కొన్నారు. తనిఖీ అధికారులు దీన్ని అడ్డంపెట్టుకుని తమను వేధించే అవకాశముంటుందని హెచ్‌ఎంలు చెబుతున్నారు. 
ప్రతినెలా 10వ తేదీలోగా వంట ఏజెన్సీకి చెల్లింపులు చేయాలి. నెలలు గడుస్తున్నా బిల్లులే రానప్పుడు చెల్లింపులు ఎలా చేయాలని హెచ్‌ఎంలు అంటున్నారు. 
 
వాస్తవానికి దూరంగా రూల్స్‌: పి.రాజా భానుచంద్ర ప్రకాశ్, గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధ్యాహ్న భోజనానికి అయ్యే వాస్తవ ఖర్చును అధికారులు గుర్తించాలి. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతున్నాయి. ఇచ్చే మొత్తంలో వీటిని కొనడం సాధ్యం కావడం లేదని వంట చేసే మహిళా సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటికీ హెచ్‌ఎంలనే బాధ్యులను చేస్తే ఎలా? బోధన వ్యవహారాలు చూసుకునే బాధ్యతల కన్నా, భోజన జమా ఖర్చు వివరాలు రాయడానికే ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల బోధనలో నాణ్యత తగ్గదా?

>
మరిన్ని వార్తలు