భౌతికదూరం పాటిస్తూ బడికెళ్లేదెలా..

25 Jan, 2021 08:21 IST|Sakshi

కోవిడ్‌ నిబంధనల మేరకు భౌతిక దూరం తప్పనిసరి 

బస్సులు, ఆటోల్లో వెళితే ముప్పు 

ఏడాది కాలంగా వాహనాలకు నిలిచిన ఫిట్‌నెస్‌ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: పిల్లలు స్కూల్‌కు ఎలా వెళ్లాలి? తిరిగి ఇంటికి చేరేదెలా? ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్నలు ఇవి. స్కూళ్లలో భౌతిక దూరంపాటించడం, తరగతి గదులను తరచుగా శానిటైజ్‌ చేయడం వంటి నిబంధనలు అమలు చేయవచ్చు. అలాగే పిల్లలకు మాస్కులు ధరించేవిధంగా జాగ్రత్తలు పాటించవచ్చు. సాధారణ రోజుల్లో  అయితే స్కూల్‌ బస్సులు, ఆటోల్లో  వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కోవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణం చేయడం సాధ్యం కాదు. పైగా కోవిడ్‌ నిబంధనలకు  విరుద్ధం కూడా. దీంతో  పిల్లలను చేరవేయడం అనేది ప్రస్తుతం అతి పెద్ద సమస్య. ప్రస్తుతం 9, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ స్థాయి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ దశలవారీగా అన్ని తరగతులను అనుమతించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భౌతిక దూరం పాటిస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయడం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం ఉంది. 

అప్పుడు అలా... 
గ్రేటర్‌లో సుమారు 3500కు పైగా స్కూళ్లలో 20 లక్షల మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్, డిగ్రీ  చదివే విద్యార్ధులు ఇందుకు అదనం. 11500 స్కూల్‌ బస్సులు, మరో  50 వేలకు పైగా ఆటోలు, 10 వేల  వ్యాన్‌లు, టాటా ఏస్‌ వంటి వాహనాల్లో  పిల్లలకు  రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటోల్లో పంపిస్తారు. ఒక్కో ఆటోలో 8 మంది విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లవలసి ఉండగా  చాలామంది ఆటోడ్రైవర్లు 15 మంది పిల్లలను ఆటోల్లో బంధించి తీసుకెళ్తారు. ఇవి కాకుండా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్ధులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ఉదయం, సాయంత్రం  వేళల్లో విద్యార్ధుల రద్దీకనుగుణంగా ఆర్టీసీ  రోజుకు 3 వేలకు పైగా ట్రిప్పులు నడుపుతుంది.

కోవిడ్‌ కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడడంతో స్టూడెంట్‌ ట్రాన్స్‌పోర్టు కూడా స్తంభించింది. లాక్‌డౌన్‌ దృష్ట్యా రవాణాశాఖ అన్ని రకాల వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలను నిలిపివేసింది. ఈ  ఫిబ్రవరి వరకు అనుమతులను పొడిగించింది. దీంతో సంవత్సరానికి ఒకసారి స్కూల్‌ బస్సులకు నిర్వహించే  ఫిట్‌నెస్‌ ధృవీకరణ కూడా ఆగింది. మరోవైపు చాలా బస్సులు ఎలాంటి నిర్వహణ లేకుండా పార్కింగ్‌ అడ్డాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికిప్పుడు ఈ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పించాలంటే  ఫిట్‌నెస్‌  పరీక్షలు చేసి వాటి సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది.  

ఇప్పుడు ఎలా... 
⇔ ప్రస్తుతం 9,10 తరగతుల పిల్లలను మాత్రమే అనుమతించాలని భావిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకు కూడా కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 
 ఈ  స్టూడెంట్స్‌ అంతా స్కూల్‌కు వెళ్లడం ఇప్పుడు సవాల్‌గానే మారింది. ఆటోలు, బస్సుల్లో  పంపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. 
 మరోవైపు పిల్లలను స్కూల్‌కు పంపించడం, తిరిగి తీసుకెళ్లడం తల్లిదండ్రుల బాధ్యత అని విద్యాసంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి.  
 ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకొనే తల్లిదండ్రులకు ఇది భారంగానే మారనుంది.  

మరిన్ని వార్తలు