Schools Reopen In Telangana: సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?

30 Aug, 2021 08:56 IST|Sakshi

సెప్టెంబర్‌ ఒకటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

అన్ని తరగతుల పునరుద్ధరణకు సన్నాహాలు

రెండేళ్లుగా నిలిచిపోయిన బస్సుల ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు

స్కూల్‌ ఆటోలు, వ్యాన్‌లకు సైతం..

గ్రేటర్‌లో సుమారు 10,500 స్కూల్‌ బస్సులు

50 వేల ఆటోలు, 20 వేలకుపైగా ఓమ్ని వ్యాన్లు

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండ్రోజుల్లో స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. కోవిడ్‌ దృష్ట్యా మూడునెలలు ఆలస్యంగా ఈ  విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించేందుకు యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్‌లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు సుదీర్ఘ విరామానంతరం పాఠశాలలకు వెళ్లనున్నారు. కానీ.. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన స్కూల్‌ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్‌ దృష్ట్యా సుమారు రెండేళ్లుగా బడి బస్సులు, ఆటోలు, వ్యాన్‌లు తదితర వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రభుత్వమే స్వయంగా మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఫిట్‌నెస్‌ లేని వాహనాలే పిల్లలను తరలించే విషయంలో ఆందోళన కలిగిస్తోంది.   

బాగుంటేనే అనుమతి... 
►సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌లో విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. రవాణా శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.  
►మోటారు వాహన తనిఖీ అధికారులు తమ పరిధిలోని అన్ని స్కూల్‌ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతినిస్తారు.  
►గ్రేటర్‌ పరిధిలో సుమారు 10,500 స్కూల్‌ బస్సులకు ఏడాది ఒకసారి మే నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆటోలు, వ్యాన్‌లకు సైతం క్రమం తప్పకుండా ఫిట్‌నెస్‌ పరీక్షలు జరుగుతాయి.  
►పిల్లల భద్రత కోసం స్కూల్‌ యాజమాన్యాలు, వాహనాలు నడిపే డ్రైవర్లు, పిల్లల తల్లిదండ్రులకు ఆర్టీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా   అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు.  
►కరోనా కారణంగా ఇంచుమించు రెండేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఫిట్‌నెస్‌ పరీక్షల నుంచి ప్రభుత్వమే మినహాయింపునివ్వడంతో చాలా బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగానే ఉన్నాయి. కొందరు యజమానులు  మాత్రం స్వచ్ఛందంగా ఫిట్‌నెస్‌ సరి్టఫికెట్లు పొందారు. 

నిర్వహణలో నిర్లక్ష్యం.. 
►స్కూల్‌ వాహనాల నిర్వహణలో సహజంగానే నిర్లక్ష్యం ఉందనే  ఆరోపణ చాలా కాలంగా ఉంది. ప్రతి సంవత్సరం మే నెలలో జరగాల్సిన ఫిట్‌నెస్‌ పరీక్షలు జూలై , ఆగస్టు వరకు కొనసాగుతూనే ఉంటాయి, 
►మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు  బస్సులను స్వయంగా పరిశీలించి, తనిఖీ చేయాల్సి ఉండగా, కిందిస్థాయి సిబ్బంది మొక్కుబడిగా ఆ పని చేస్తున్నారు. స్కూల్‌ ఆటోలు, వ్యాన్‌ల నిర్వహణలోనూ అదే నిర్లక్ష్యం నెలకొని ఉంది.  
►గ్రేటర్‌లో సుమారు 1.4 లక్షల  ఆటోలు ఉన్నాయి. వాటిలో కనీసం 50 వేల ఆటోలు స్కూల్‌ పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. కోవిడ్‌ దృష్ట్యా ఈ ఆటోలన్నీ ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలకు పరిమితమయ్యాయి.  
►మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు మారుతీ ఓమ్ని, మెటడోర్‌ వంటి వాహనాలను స్కూల్‌  పిల్లలకు వినియోగించడం నేరం. కానీ.. సుమారు 20 వేలకు పైగా వ్యాన్‌లు పిల్లల తరలింపు కోసం నడుస్తున్నాయి. ప్రస్తుతం వీటి ఫిట్‌నెస్‌ పరీక్షలు కూడా నిలిచిపోయాయి.  

ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యం.. 
►వాహనాల ఫిట్‌నెస్‌ గడువును కేంద్రం సెపె్టంబర్‌ వరకు పొడిగించింది. కానీ స్కూళ్లు మాత్రం తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఫిట్‌నెస్‌ పరీక్షలు అసాధ్యం. 
►ఇప్పుడున్న స్థితిలోనే వాహనాలను వినియోగించడం లేదా, తల్లిదండ్రులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవడం  ఒక్కటే పరిష్కారం. ఉన్నపళంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్న దృష్ట్యా పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే అంశంపై  చాలా మంది తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. 

మరిన్ని వార్తలు