దేశంలో ప్రజారోగ్య విభాగం ఏర్పాటు కావాలి

13 Aug, 2021 04:34 IST|Sakshi

అప్పుడే కోవిడ్‌ లాంటి వ్యాధుల నియంత్రణ సాధ్యం 

సీఎంసీ వెల్లూరు శాస్త్రవేత్త జాకబ్‌ జాన్‌

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ లాంటి మహమ్మారి ఇంకొకటి తాకేలోపు దేశంలో ప్రజారోగ్య విభాగం ఏర్పాటు తప్పనిసరి అని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (వెల్లూరు) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జాకబ్‌ జాన్‌ స్పష్టంచేశారు. ఇలాంటి విభాగం లేనందున కోవిడ్‌ వ్యాధి నిర్వహణ బాధ్యతలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థల చేతుల్లో పెట్టాల్సివచ్చిందని వాపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చిందని, మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయని అన్నారు.

‘కోవిడ్‌ నేర్పిన పాఠాలు’ అన్న అంశంపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్‌ వచ్చిన తొలినాళ్లలో 2020 మే 3 నాటికి కేసుల సంఖ్య 6.4 లక్షలకు చేరుకోవచ్చునని భారత వైద్య పరిశోధన సమాఖ్య జరిపిన సర్వే తెలిపిందని, కానీ ఆ రోజుకు అధికారికంగా నమోదైన కేసులు 42 వేలు మాత్రమేనని చెప్పారు. 2020 మార్చిలో కేరళలో మూడు కేసులు దిగుమతి కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారిని పరిశీలించగలిగే వ్యవస్థ లేకపోవడంతో అసలు కేసులెన్ని అన్నది స్పష్టం కాలేదని వివరించారు. ప్రజారోగ్య వ్యవస్థ ఉంటే దేశంలో ఏమూలనైనా కారణాలు తెలియకుండా ఎవరైనా మరణించినా, కొత్త లక్షణాలతో ఎవరికైనా వ్యాధి సోకినా ఆ విషయం వెంటనే అన్ని స్థాయిల్లోని అధికారులకు తెలిసిపోతుందని, కట్టడి చర్యలు సులువు అవుతాయని తేల్చిచెప్పారు.  

జిల్లాస్థాయిలో నిర్ణయాలు తీసుకునేలా.. 
కరోనా వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడాన్ని అడ్డుకోకపోవడమే భారత్‌ చేసిన అతిపెద్ద తప్పిదమని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి చెప్పారు. తొలిదశ కరోనాను సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాతి కాలంలో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండో దశ అనివార్యమైందన్నారు. సెరోసర్వేల ప్రకారం 60 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారని.. అయితే ఈ యాంటీబాడీలు వైరస్‌ను నాశనం చేసేవా? కాదా? అన్నది ఎవరూ పరిశీలించలేదని పేర్కొన్నారు. కోవిడ్‌ తరహా మహమ్మారులను సమర్థంగా కట్టడి చేయాలంటే జిల్లాస్థాయిలోనే నిర్ణయాలు తీసుకోగల వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి, మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు