అనంతగిరి కొండల్లో అరుదైన మొక్క

18 Jul, 2021 15:06 IST|Sakshi

జడ్చర్ల టౌన్‌: వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లోని గడ్డి మైదానంలో కొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్‌ గార్డెన్‌ నిర్వాహకుడు, వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్య తెలిపారు. శనివారం జడ్చర్లలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉస్మానియా వర్సిటీ వృక్షశాస్త్ర అధ్యాపకుడు వియభాస్కర్‌రెడ్డి, అతని శిష్యుడు పరమేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జీవవైవిధ్య మండలి పరిశోధకులు డా.ప్రసాద్‌తో పాటు తాను కలసి ఈ మొక్కను పరిశీలించినట్లు తెలిపారు. ఈ మొక్కకు బ్రాకిస్టెల్మా అనంతగిరియెన్సె అని నామకరణం చేసినట్లు సదాశివయ్య తెలిపారు. 

నిమ్మగడ్డి పెరిగే ప్రదేశాల్లో మాత్రమే చిన్న చిన్న రాళ్ల మధ్య పెరుగుతుందని, మొక్క ప్రస్తుతం 3 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉందని వెల్లడించారు. బంగాళాదుంప ఆకారంలో దుంపను కలిగిన మొక్క తొలకరి చినుకులకు మొలకెత్తి ఆకులు లేకుండా పుష్పిస్తుందన్నారు. ముదురు గోధుమ రంగులో సుమారు 2.5 సెంటీమీటర్లు పూచే ఈ పూలు మెలికలు తిరిగి ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. ప్రజాతికి చెందిన మొక్కల దుంపలను అనేక ప్రదేశాల్లో తినడమే గాక సుఖవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రజాతికి చెందిన 38 మొక్కలను దేశంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారని, ఈ మొక్క 39వదిగా వివరించారు. కేవలం వంద మొక్కలు మాత్రమే ఉన్నందున అంతరించిపోయే మొక్కగా దీనిని గుర్తించామని చెప్పారు.

మరిన్ని వార్తలు