వై క్రోమోజోమ్‌... వెరీ స్పెషల్‌!

18 Sep, 2021 00:50 IST|Sakshi

కొన్ని పునరుత్పత్తి జన్యువుల నియంత్రణలో కీలకపాత్ర 

తాజా పరిశోధనలో గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: పురుషులకు మాత్రమే ప్రత్యేకమైన వై క్రోమోజోమ్‌కు సంబంధించి ఒక కొత్త, వినూత్నమైన అంశాన్ని శాస్త్రవేత్తలు వెలికితీశారు. కేవలం లింగ నిర్ధారణకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా పూర్తిగా నిజం కాకపోవచ్చని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లింగ నిర్ధారణతోపాటు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇతర జన్యువుల నియంత్రణలోనూ వై క్రోమోజోమ్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ రాచెల్‌ జేసుదాసన్‌ తెలిపారు.

బీఎంసీ బయోలజీ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఎలుకల వై క్రోమోజోమ్‌ను పరిశీలించినప్పుడు అందులో నిర్దిష్ట డీఎన్‌ఏ భాగం కొంత ఎడంతో పదేపదే కనిపిస్తోందని... ఇవి ఇతర క్రోమోజోమ్‌లలోని జన్యువుల వ్యక్తీకరణపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసిందని వివరించారు. వృషణాల్లోని ఈ జన్యువులు కేవలం పునరుత్పత్తికి మాత్రమే చెంది ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. పునరావృతమవుతున్న డీఎన్‌ఏ భాగం కొన్ని జీవజాతుల్లో ఉంటే మరికొన్నింటిలో లేదని, ఇది ప్రత్యేకమైన చిన్నస్థాయి ఆర్‌ఎన్‌ఏల ఉత్పత్తికి కారణమవుతోందని జేసుదాసన్‌ వివరించారు.

చిన్నస్థాయి ఆర్‌ఎన్‌ఏలపై ఇదే తొలి పరిశోధన వ్యాసమన్నారు. జీవజాతుల పరిణామ క్రమంలో ఈ పునరావృత డీఎన్‌ఏ భాగాలు పునరుత్పత్తిని నియంత్రించే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సలహాదారు (పరిశోధనలు)గా వ్యవహరిస్తున్న జేసుదాసన్‌... ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ జీన్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త కూడా.   

మరిన్ని వార్తలు