రాష్ట్రంలో ఐదు రకాల డెల్టా వేరియంట్లు 

18 Aug, 2021 03:30 IST|Sakshi

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో గుర్తించిన శాస్త్రవేత్తలు 

హైదరాబాద్, గద్వాలలో నాలుగు రకాలు 

జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 3 రకాలు 

జూలైలో నమోదైన కేసుల్లో ఎక్కువగా డెల్టా 12వ రకం ఉన్నట్టు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రెండో వేవ్‌లో నమోదైన కేసుల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన ఐదు ఉప రకాలు వ్యాప్తి చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. తాజాగా ‘గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ)’లో ఈ వివరాలను పొందుపరిచారు. రాష్ట్రంలో జూలై నాటికి నమోదైన కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని ఇప్పటికే ప్రకటించగా.. అందులో ఉప రకాల డేటాను ప్రస్తుతం వెల్లడించారు. దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌లో ఏకంగా 13 ఉప రకాలు ఉన్నాయని.. అందులో తెలంగాణలో ఐదు రకాలు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు.  

రాష్ట్రంలో ఎక్కువగా ‘ఏవై–12’ వ్యాప్తి 
జూలైలో నమోదైన కరోనా కేసుల్లో దేశవ్యాప్తంగా అసలైన డెల్టా రకం కేసులు ఎక్కువశాతం ఉండగా.. రాష్ట్రంలో మాత్రం డెల్టా ఉప రకం ‘ఏవై–12’కేసులు అధికంగా నమోదైనట్టు తేలింది. రాష్ట్రంలో ఈ ఉపరకం కేసులు 48 శాతం ఉండగా.. అసలైన డెల్టా కేసులు 31 శాతమే నమోదయ్యాయి. 

తర్వాత నాలుగో రకం (ఏవై–4) డెల్టా కేసు లు 10%, ఆరో రకం 3 శాతం, ఐదో రకం ఒక శాతం, మిగతా అన్ని వేరియంట్లు/ఉప రకాలు కలిపి ఏడు శాతం కేసులు వచ్చాయి. 
హైదరాబాద్‌లో ఒరిజినల్‌ డెల్టా 45 శాతం, 12వ రకం డెల్టా కేసులు 41 శాతం ఉన్నాయి. 
హైదరాబాద్, గద్వాలలో నాలుగు రకాల డెల్టా ఉప రకాలు ఉండగా.. జగిత్యాల, మహబూబ్‌బాబాద్‌ జిల్లాల్లో 3 రకాలు వ్యాప్తి చెందాయి. 
జగిత్యాల, జనగాం, గద్వాల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ శాతం ‘ఏవై–12’రకం కేసులు నమోదయ్యాయి. 
ఒరిజినల్‌ డెల్టా కేసులు అత్యధికంగా హైదరాబాద్, జగిత్యాల, మేడ్చల్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వచ్చాయి. 
వనపర్తి జిల్లాలో నాలుగో రకం డెల్టా వైరస్‌ ఉందని తేలింది.

రెండు మ్యూటేషన్లతో.. 
రాష్ట్రంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న ‘ఏవై–12’ఉప రకంలో రెండు మ్యూటేషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒరిజినల్‌ డెల్టాతో పోలిస్తే టీ–33ఆర్, పీ–1162ఏ ప్రొటీన్లు మ్యూటేషన్‌ చెందాయని వెల్లడించారు. అయితే ఇవి ఏ మేరకు ప్రమాదకరం అన్నదానిపై స్పష్టత లేదని.. పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తే, దాని వ్యాప్తి సామర్థ్యం, ప్రమాద తీవ్రత తెలుస్తుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు