రైళ్లలో ప్రీమియం తత్కాల్‌ దోపిడీ..రూ.450 టికెట్‌ రూ.1000పైనే 

24 Oct, 2022 14:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సందర్భంగా సొంత ఊరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు సురేష్‌. రైళ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి తత్కాల్‌ కోసం ప్రయత్నించాడు. సాధారణంగా స్లీపర్‌ చార్జీ రూ.390 వరకు ఉంటుంది. దానిపై 30 శాతం అదనంగా రూ.450 వరకు చెల్లించి తత్కాల్‌ టికెట్‌పై వెళ్లిపోవచ్చని భావించాడు. నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి రూ.1800 వరకు ఖర్చవుతుంది. మొత్తంగా రూ.3600తో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లి రావచ్చు.

సాధారణం కంటే కొద్దిగా ఎక్కువే అయినా ఫర్వా లేదనుకున్నాడు. చూస్తుండగానే క్షణాల్లో తత్కాల్‌ బుకింగ్‌లు అయిపోయాయి. సరిగా అదే సమయంలో ‘ప్రీమియం తత్కాల్‌’ దర్శనమిచ్చింది. రూ.450 తత్కాల్‌ స్లీపర్‌ చార్జీ అమాంతంగా రూ.1050కి చేరింది. అంటే నలుగురికి కలిపి రూ.4200 చొప్పున సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ.8,400 అవుతుంది. మరో గత్యంతరం లేక ప్రీమియం తత్కాల్‌ టికెట్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది.  

డిమాండ్‌ ఉంటే చాలు.. 
ఒక్క తిరుపతికి వెళ్లే రైళ్లు మాత్రమే కాదు. ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న ఏ రైళ్లలో అయినా సరే ‘ప్రీమియం తత్కాల్‌’ పేరిట రైల్వే అదనపు దోపిడీకి తెరలేపింది. ఫ్లైట్‌ చార్జీలను తలపించేలా   తత్కాల్‌ చార్జీలను ఒకటి నుంచి రెండు రెట్లు పెంచేస్తున్నారు. గతంలో ‘డైనమిక్‌ ఫేర్‌’ పేరుతో కొన్ని పరిమిత రైళ్లకు, ఏసీ బెర్తులకు మాత్రమే పరిమితం కాగా ఇప్పుడు ఏ మాత్రం రద్దీ ఉన్నా సరే స్లీపర్‌ క్లాస్‌ను సైతం వదిలి పెట్టకుండా అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండగ రోజుల్లో, వరుస సెలవుల్లో నడిపే ప్రత్యేక రైళ్లలో కూడా తత్కాల్‌పై రెట్టింపు చార్జీలు విధించడం గమనార్హం. ప్రైవేట్‌ బస్సులు, ఇతర  వాహనాల చార్జీల కంటే అతి తక్కువ చార్జీలతో  ప్రయాణ సదుపాయాన్ని అందజేసే రైళ్లు కూడా క్రమంగా సామాన్యులకు భారంగా మారాయి. 

ఈ రైళ్లకు భారీ డిమాండ్‌... 
హైదరాబాద్‌ నుంచి  ప్రతి రోజు సుమారు 200 రైళ్లు   వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 85  ప్రధాన రైళ్లు దేశ వ్యాప్తంగా బయలుదేరుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, గోదావరి ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉండే బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, షిరిడీ, పట్నా, దానాపూర్‌ రైళ్లలో ‘ప్రీమియం తత్కాల్‌’ చార్జీలు  విధిస్తున్నారు.  

మరిన్ని వార్తలు