యూటీఎస్‌ యాప్‌ వాడుతున్నారా? అయితే.. మీకో గుడ్‌న్యూస్‌

22 Sep, 2022 08:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో జనరల్‌ కంపార్ట్‌మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్‌ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. . రైలు బయలుదేరే సమయం దాకా క్యూలు తరగవు.. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్‌’ యాప్‌.

గతంలో అన్‌రిజర్వ్‌డ్‌ బోగీల్లో ప్రయాణమంటే కచ్చితంగా స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్‌ కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఆ కోచ్‌లలో కూడా ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటును ఈ యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్‌ ద్వారా.. అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో టికెట్‌ బుక్‌ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

సబర్బన్‌ స్టేషన్లకు సంబంధించి గతంలో స్టేషన్‌ నుంచి ఐదు కిలోమీటర్ల గరిష్ట పరిధిలో యాప్‌ ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఇప్పుడు 10 కిలోమీటర్లకు పెంచారు. అలాగే.. నాన్‌ సబర్బన్‌ స్టేషన్‌ల గరిష్ట పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు విస్తరించారు. స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి ఈ పరిధి లెక్కలోకి వస్తుంది. ఈ వెసులుబాటు లేక గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్లు.

అన్‌ రిజర్వ్‌డ్‌ బోగీలో సీట్ల రిజర్వేషన్‌ ఉండదు. కేవలం టికెట్‌ మాత్రమే బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నది తెలిసే ఉంటుంది. అలా ముందస్తుగా బుక్‌ చేసు­కున్న వారికి టికెట్‌ వివరాలు సంబంధిత ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో అందుతాయి. రైళ్లలో టీటీఈలకు ఆ వివరాలు చూపితే సరిపోతుంది. ఈ యాప్‌ ద్వారా అన్‌ రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు, సీజన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. వివిధ రకాల వాలెట్లు.. ఆర్‌–వాలెట్, పేటీఎం,మోబిక్విక్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు జరపొచ్చు.

ఇదీ చదవండి: ఛలాన్లు కట్టకుంటే ‘మోత’ మోగుద్ది

>
మరిన్ని వార్తలు