వందే భారత్‌ రైళ్లపై రాళ్ల దాడి.. దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక!

29 Mar, 2023 15:20 IST|Sakshi

ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనవరి 15న సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన ఈ రైల్లో ప్రయాణించేందకు జనాలు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వందే భారత్‌ రైలుపై రాళ్లు విసిరుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. 2019 ఫిబ్రవరిలో దేశంలో వందే భారత్‌ సేవలు ప్రారంభమవ్వగా.. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైలుపై అనేక దాడులు జరిగాయి.

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మార్గ మధ్యలో వందేభారత్‌పై ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారు. ఇటీవల ఖమ్మం, విశాఖపట్నం, మహబూబాబాద్‌-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య మధ్య దుండగులు రాళ్లు విసరడంతో బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు రైలును నిలిపి వేయడం, పునరుద్ధరించడానికి సమయం కూడా పడుతోంది..జనవరి నుంచి ఇలాంటి ఘటనలు 9 వెలుగుచూశాయి.

వందేభారత్ రైలుపై వరుస దాడుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైళ్లపై దాడికి పాల్పడేవారిని హైచ్చరికలు జారీచేసింది. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే రైళ్లపై రాళ్లు రువ్వడం లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపింది

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లపై రాళ్ల దాడి చేయడం.. ఆర్పీఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమని.. దీనికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని పేర్కొంది.  కాగా ఇప్పటి వరకు పలు కేసులు నమోదు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) 39 మందిని అరెస్టు చేసింది.

మరిన్ని వార్తలు