మొబైల్‌ టాయిలెట్లు.. మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్లకూ సౌకర్యం 

17 Jun, 2021 10:42 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అందుబాటులో టాయిలెట్లు లేకపోవడంతో పాటు పిల్లలకు పాలు ఇచ్చే సందర్శకులు, రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లే వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన జీహెచ్‌ఎంసీ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నెక్లెస్‌ రోడ్‌లో మొబైల్‌ టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల నెక్లెస్‌ రోడ్‌కు వచ్చే వేలాది మంది పర్యాటకులతో పాటు ఇక్కడ వ్యాపారాలు కొనసాగించే మహిళలకు ఎంతగానో ఉపయోగం చేకూరనుంది. ఇప్పటి వరకు టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో తెరపడినట్లైంది.  

నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్‌ టాయిలెట్లుగా మార్చారు.  
నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.  
వీటిలో ప్రత్యేకంగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు.  
మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ మొబైల్‌ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు.  
ఇప్పటికే 30 మొబైల్‌ టాయిలెట్లు నగర వ్యాప్తంగా అందుబాటులో ఉండగా... ఖైరతాబాద్‌ జోన్‌కు కొత్తగా మరో ఐదు మొబైల్‌ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు.  
రద్దీ ప్రాంతాలు, సభలు, సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో, సందర్శనా స్థలాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, పార్కుల వద్ద ఈ మొబైల్‌ టాయిలెట్లను ఉపయోగిస్తారు. 
వీటిలో మహిళలకు రెండు, పురుషులకు ఒకటి, ట్రాన్స్‌జెండర్స్‌కు ఒకటి చొప్పున నాలుగు యూరినల్స్‌ను ఏర్పాటు చేశారు.  
ఇక పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 
ఈ మొబైల్‌ టాయిలెట్‌ వెనుకాల స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్‌ బాటిల్స్‌ విక్రయానికి గాను ఒక షాపును ఏర్పాటు చేశారు. 
సోలార్‌ పవర్‌ విధానం కల్పించిన ఈ మొబైల్‌ టాయిలెట్‌ నిర్వహణను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ఇచ్చారు.  
ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఈ మొబైల్‌ టాయిలెట్‌ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  
నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్‌ టాయిలెట్లుగా రూపొందించిన నేపథ్యంలో ఇక్కడ విజయవంతమైతే మరిన్ని బస్సులను మొబైల్‌ టాయిలెట్లుగా తయారు చేయనున్నారు. 
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజ గుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్, రవీంద్రభారతి తదితర ప్రాంత్లాలో కూడా నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్‌ టాయిలెట్లుగా మార్చే దిశలో కసరత్తు జరుగుతుంది. ఇందు కోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు.  
ఈ మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు హర్షణీయమని మహిళలు అంటున్నారు.  
మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

చదవండి:  God Of Mischief: లోకి గురించి మీకు ఈ విషయాలు తెలుసా!

మరిన్ని వార్తలు