అసలు పేచీ స్క్రీనింగ్‌ టెస్టే

4 Jan, 2023 00:51 IST|Sakshi

వర్సిటీల కామన్‌ బోర్డుపై కదలని ఫైల్‌ 

యూజీసీ నిబంధనల్లో పరీక్ష ప్రస్తావనే లేదు 

ప్రతిపాదిత స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా నియామకాలపై గవర్నర్‌ అభ్యంతరం 

యూనివర్సిటీ పోస్టుల నియామకంపై కొనసాగుతున్న గందరగోళం 

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలనుకుంటున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ విధానమే వివాదంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌ ఆమోదించపోవడానికి ఈ నిబంధనే కారణమని తెలుస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలకు ఇది విరుద్ధమని గరవ్నర్‌ భావిస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్తగా కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌ అనుమతి కోసం పంపింది. దీనిపై అనేక అనుమానాలున్నాయని, నివృత్తి చేయాలని విద్యామంత్రికి గవర్నర్‌ తమిళిసై సూ­చించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతోకలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి సబిత గవ­ర్నర్‌ సందేహాలను నివృత్తి చేశారు. అయినప్పటికీ నెలల తరబడి ఈ బిల్లుకు మోక్షం కలగడంలేదు.

అసలా రూల్‌ ఎక్కడిది? 
ఇప్పటివరకు వర్సిటీలన్నీ సొంతంగా నియామకాలు చేపట్టేవి. అయితే కామన్‌ బోర్డు బిల్లులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సహా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసేవారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక పోస్టుకు 200 మంది దరఖాస్తు చేస్తేనే పరీక్ష పెట్టాలనే నిబంధన ఉన్నట్లు గవర్నర్‌ కార్యాలయం గుర్తించింది.

యూజీసీ నిబంధనల ప్రకారమే చట్టా న్ని తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం... లేని పరీక్ష ను ఎందుకు తెచ్చిందనే దానిపై గవర్నర్‌ కార్యాల యం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీన్ని మారిస్తేనే బిల్లును ఆమోదిస్తామని ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించినట్లు సమాచారం. ఈ సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడ ట్లేదు. అవసరమైతే వర్సిటీల చాన్సలర్‌గా గవర్నర్‌ ను తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పీటముడి నేపథ్యంలో వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల కోసం నిరీక్షిస్తున్న 3 వేల మంది నిరాశ చెందుతున్నారు. 

వీసీల నుంచి వ్యతిరేకత... 
కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటును పలు వర్సిటీల వీసీలు వ్యతిరేకిస్తున్నారు. బోర్డు నియమాక ప్రక్రియకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని వర్సిటీల నిధుల నుంచే ఖర్చు చేసే ప్రతిపాదనను వారు ఆక్షేపిస్తున్నారు. ఒడిశాలో ఈ తరహా బోర్డు ను ఏర్పాటు చేసినా నియామకాల్లో వీసీలకే ప్రాధా న్యం ఇచ్చారని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే తరహా విధానం కొనసాగుతోందని ఓ వీసీ తెలిపా రు.

విశ్వవిద్యాలయాల పరిస్థితులతో సంబంధం లేని ఐఏఎస్‌ అధికారులకు బోర్డు సభ్యులుగా పూర్తి అధికారాలు ఇవ్వడం వల్ల తమ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బోర్డు ఏర్పాటుపై గవర్నర్, ప్రభు త్వం మధ్య నెలకొన్న వివాదం కారణంగా నియామక ప్రక్రియే ఆగిపోయిందని, దీనివల్ల అధ్యాపకులు లేక బోధన కుంటుపడుతోందని వీసీలు అంటున్నారు. 

ఇది చెల్లదు.. సుప్రీం తీర్పు ఉంది.. 
ప్రభుత్వం స్క్రీనింగ్‌ టెస్ట్‌ పెట్టాలనుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం. 2017లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. సర్వీస్‌ కమిషన్‌ ద్వారా చేపట్టిన నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మనెంట్‌ చేస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇది కూడా చేయకుండా కొత్త నియామకాలు ఎలా చేపడతారు. 
– డాక్టర్‌ ఎం. రామేశ్వరరావు, తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్స్‌ జేఏసీ చైర్మన్‌   

మరిన్ని వార్తలు