తెలంగాణలో నేటి నుంచి రెండో డోసు

25 May, 2021 19:29 IST|Sakshi
సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

టీకా పంపిణీ పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం 

సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ 

పీహెచ్‌సీలు, పరీక్షా కేంద్రాలకు అవసరమైన మేర కిట్ల సరఫరా 

తక్షణమే 50 లక్షల ర్యాపిడ్‌ కిట్ల కొనుగోళ్లు 

పాజిటివ్‌ రేటు 5శాతంకన్నా తగ్గితేనే విజయం సాధించినట్టు 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం 

మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనడానికి సిద్ధమై ఉండాలని ఆదేశం 

కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదిరోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మంగళ వారం (నేటి) నుంచే పునఃప్రారంభమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. మొదటి డోసు వేయించుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వాళ్లు దగ్గరలోని ప్రభుత్వ వ్యాక్సి నేషన్‌ కేంద్రానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. దీనితోపాటు కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమైన సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి, ప్రత్యేకంగా వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి హరీశ్‌ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశిం చారు. దీనికి సంబంధించి తగిన విధి విధానాలను రూపొందించాలని సీఎం సూచించారు.

ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం వస్తున్న ఏ ఒక్కరినీ వెనక్కి తిప్పి పంపరాదని, ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పీహెచ్‌సీలు, పరీక్షా కేంద్రాలకు సరఫరా చేస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ సోమ వారం రాష్ట్రంలో కరోనా కట్టడి, బ్లాక్‌ ఫంగస్‌ పరి స్థితి, వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌ అమలుపై ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు.

ద్విముఖ వ్యూహంతో..
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, ఇందుకవసరమైన 50 లక్షల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలు, పరీక్షా కేంద్రాలకు రోజువారీగా సరఫరా చేస్తున్న కిట్ల సంఖ్యను మంగళవారం నుంచి పెంచాలని సూచిం చారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి కిట్లను తెప్పించు కోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులకు పరీక్షల కోసం వచ్చే వారిలో అధికశాతం నిరుపేదలేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తూ, మందుల కిట్లను అందించే కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ఓవైపు దీన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు కరోనా పరీక్షలను మరింతగా పెంచి.. ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు.

తక్షణమే సిబ్బందిని నియమించుకోండి..
పరీక్షా కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని.. ఇందుకు కలెక్టర్లు, వైద్యాధి కారులకు ఇప్పటికే అధికారాలు ఇచ్చామని కేసీఆర్‌ చెప్పారు. డీఎంహెచ్‌వోలతో వెంటనే టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి.. నియామకాల ప్రక్రియ, దవాఖానాల్లో మందులు, ఇతర అవసరాలపై నివేదిక తెప్పిం చాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశిం చారు. కరోనా నియంత్రణ చర్యలన్నీ తీసుకోవా లని, ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని మరోసారి స్పష్టం చేశారు. మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

కంపెనీలతో మాట్లాడి వ్యాక్సిన్లు తెప్పించండి
రాష్ట్రంలో వ్యాక్సిన్‌ రెండో డోసు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నందున.. వారికి సరిపోను వ్యాక్సిన్లను వెంటనే సరఫరా చేయాల్సిందిగా కంపెనీలతో మాట్లాడాలని ‘కరోనా టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌’ మంత్రి కేటీఆర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అన్ని పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించాలని, రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని 600 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేప«థ్యంలో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతుందని, కొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందని సీఎం అన్నారు. ఖర్చు పెరిగే పోలీస్, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్‌ను పెంచాలని, దీనిపై సమీక్షిం చాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా తగ్గుముఖం.. ఇంకా కట్టడి చేయాలి
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని.. ప్రజా శ్రేయస్సు, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలవుతోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. లాక్‌డౌన్‌తో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసిన ఢిల్లీలాంటి నగరాల్లో చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కరోనా పాజిటివ్‌ రేటును తగ్గించడంలో ఇప్పటికే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని.. అయితే పాజిటివ్‌ రేటును 5 శాతం కన్నా తగ్గించగలిగినప్పుడే విజయం సాధించినట్టు అని పేర్కొన్నారు.

ఎవరినీ వెనక్కి పంపొద్దు 
కరోనా పరీక్షల కోసం వచ్చే ఏ ఒక్కరినీ తిప్పి పంపొద్దు. ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలి. ఈ మేరకు కిట్ల సరఫరాను పెంచాలి..

పది కోట్ల మందికి లెక్కన.. 
పక్క రాష్ట్రాల నుంచి కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే.. కరోనా చికిత్సల విషయంలో పది కోట్లుగా అంచనా వేసుకోవాలె. మనకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా చికిత్సను అందజేయక తప్పే పరిస్థితి లేదు. కరోనా నియంత్రణను మించిన ప్రాధాన్యత మరోటి లేదు. ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే అప్పులు తెచ్చి అయినా కరోనాను కట్టడి చేస్తాం.. 

ప్రైవేటు రంగం మానవతా దృక్పథం చూపాలె..  
కరోనా, బ్లాక్‌ ఫంగస్‌తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతోపాటు.. ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృక్పథంతో స్పందించాలి.   

– సీఎం కేసీఆర్‌

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు 1,500 బెడ్లు
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో 150, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో 250 కలిపి ప్రస్తుతం 400 బెడ్లను ఏర్పాటు చేసినట్టు వైద్యాధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా బ్లాక్‌ ఫంగస్‌ విస్తరణ, బెడ్ల సంఖ్య పెంపుపై చర్చించారు. సరోజినీ దేవి ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,500 బెడ్లను బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల కోసం తక్షణమే కేటాయిం చాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో 1,100, జిల్లాల్లో 400 బెడ్లు ఉండాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే మందులకు తక్షణమే ఆర్డర్లు ఇవ్వాలని, ఈ చికిత్సలో వాడే ‘పోసకోనజోల్‌’ స్టాక్‌ తక్షణమే పెంచా లని సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ కట్టడికి అవసరమైన మేర వైద్యులను యుద్ధ ప్రాతి పదికన నియమించుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు