మళ్లీ కంటి వెలుగు.. జనవరి 18 నుంచి షురూ

18 Nov, 2022 03:25 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

అవసరమైన వారందరికీ ఉచిత నేత్ర పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. కంటి వెలుగు అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై సీఎం కేసీఆర్‌ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పేదల కన్నుల్లో వెలుగులు నింపాం
‘గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటి చూపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. అందువల్ల మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగానే కంటి అద్దాలు కూడా అందిస్తాం’ అని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, కళ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు.

ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీని వాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్‌ రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజే శ్వర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, ప్రభు త్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బుల్లెట్‌ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్‌.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం

మరిన్ని వార్తలు