తెలుగు భాష అజరామరం

20 Nov, 2021 18:37 IST|Sakshi

నవనవోన్మేషితంగా వెలుగొందుతూనే ఉంటుంది

సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ 

విజయవంతంగా న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ సదస్సు

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాష అజరామరమైందని, మరెన్ని శతాబ్దాలు గడిచినా నవనవోన్మేషితంగా వెలుగొందుతూనే ఉంటుందని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు భాషకు మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్, ఆస్ట్రేలియాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన రెండవ తెలుగు సాహిత్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుమల్లి  వ్యవస్థాపకులు మల్లికేశ్వర్‌రావు కొంచాడ, న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షురాలు శ్రీలత మగతల ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. గోల్కొండ కుతుబ్‌షాహీలు, ఆ తరువాత వచ్చిన అసఫ్‌జాహీల కాలంలో అధికార భాషలుగా పర్షియా, ఉర్ధూ వంటివి  కొనసాగినప్పటికీ  ప్రజల  భాషగా  తెలుగు వర్ధిల్లిందన్నారు. కాకతీయుల కాలం నాటికే  తెలంగాణలో  గొప్ప సాహిత్యం వెలువడిందని పేర్కొన్నారు.

ఎంతోమంది కవులు, కవయిత్రులు తెలుగు భాషలో సాహితీ సృజన చేశారన్నారు. బసవపురాణం రాసిన పాల్కురికి సోమనాథుడు తన ద్విపద కావ్యాలతో తెలుగును సుసంపన్నం చేశారని అన్నారు. ప్రముఖ అధ్యాపకులు,వ్యక్తిత్వ వికాసనిపుణులు  ఆకేళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ, నిరంతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మూర్తిమత్వం వికసిస్తుందన్నారు. ఈ సందర్భంగా  ప్రపంచంలోని వివిధ దేశాల్లో కోవిడ్‌ మమ్మారి సృష్టించిన పరిణామాలపై న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రచురించిన రెప్పవాల్చని కాలం పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సింగపూర్‌ నుంచి రత్నకుమార్‌ కవుటూరు, రాధిక మంగిపూడి,తదితరులు పాల్గొన్నారు. అలాగే న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,మలేసియా, సింగపూర్, తదితర దేశాలకు చెందిన తెలుగు కవులు, రచయితలు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు