Corona Virus: పల్లెల్లోనూ పాగా ..లక్షణాలున్నవారు లక్షల్లోనే.. 

19 May, 2021 02:48 IST|Sakshi

పట్టణాలతో సమానంగా గ్రామాల్లోనూ పాకిన కరోనా వైరస్‌

రెండో దశలో గ్రామాల్లో వేగంగా కరోనా వ్యాప్తి

వైరస్‌ నిర్ధారణతో పాటు లక్షణాలున్న వారి సంఖ్యా ఎక్కువే

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి

ప్రభుత్వ ఇంటింటి సర్వేలో స్పష్టమవుతోందీ ఇదే

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బాధితులు 48 వేల మంది

లక్షణాలున్నాయని గుర్తించిన వారు 2.30 లక్షలకు పైమాటే

సాక్షి, నెట్‌వర్క్‌ : మొదటి దశలో చాలావరకు నగరాలు, పట్టణాలకు పరిమితమైన కరోనా, సెకండ్‌ వేవ్‌లో పల్లెలపై ప్రతాపం చూపిస్తోంది. మొదటి దశలో గ్రామాల్లో తీసుకున్న కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు కొంత సత్ఫలితాలనిచ్చాయి. అదేవిధంగా గ్రామీణుల రోగ నిరోధక శక్తీ వైరస్‌ సోకకుండా నిలువరించిందని నిపుణులు భావించారు. అయితే ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ విజృంభణతో పల్లెలు విలవిల్లాడుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ నిర్ధారణ (పాజిటివిటీ) రేటు పట్టణాలతో సమానంగా ఉండగా.. జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా అనుమానిత లక్షణాలున్న వారి సంఖ్య పల్లెల్లో ఎక్కువగా ఉన్నట్టు ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో తేలింది. ఈ మేరకు సాక్షి ప్రతినిధులు జిల్లాలవారీగా ఇంటింటి సర్వేలో పాల్గొన్న సిబ్బందితో మాట్లాడి.. వివరాలు సేకరించారు.  ప్రభుత్వం చేస్తున్న సర్వే లెక్కలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సరిహద్దు జిల్లాలపై పంజా
గతంలో మాదిరి కాకుండా ఈసారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరిహద్దుల్లో కంచెలు వేయక పోవడం, రాకపోకలు నియంత్రించక పోవడం వంటి అజాగ్రత్తలు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా పలు రకాలుగా రూపాంతరం చెందడం కూడా పల్లెల్లో వైరస్‌ వేగంగా విస్తరించడానికి కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో వైరస్‌ నిర్ధా రణ అయిన వారితో పోలిస్తే, కరోనా లక్షణాలున్న వారు దాదాపు ఐదింతలు (పల్లెలు, పట్టణాల్లో కలిపి) ఎక్కువగా ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేయడం ద్వారానే ఈ మహమ్మారిని అరికట్టవచ్చనే  ఉద్దేశంతోనే ఫీవర్‌ సర్వే చేపట్టారు. లక్షణాలు కనిపిస్తే చాలు చికిత్స ప్రారంభించాలన్న మార్గదర్శ కాలకు అనుగుణంగా ఈ సర్వే సాగుతోంది. లక్షణాలున్నాయని తేలిన వెంటనే వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతూ మందుల కిట్లు అందజేసే బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటోంది.

వరంగల్‌ జిల్లాలో.... 
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2,97,014 ఇళ్లలో ప్రభుత్వం సర్వే నిర్వహించగా 8,035 మంది జ్వర బాధితులుగా తేలారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1,52,697 కుటుంబాలలోనే సర్వే నిర్వహిం చినప్పటికీ 8,126 మందికి కరోనా లక్షణాలు కనిపించడం గమనార్హం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1,06,560 ఇళ్లకు గాను 3,443 మందికి, ములుగులో 84,318 ఇళ్లకు గాను 2,328, జనగామలో 1,61,287 ఇళ్లకు గాను 6,686, మహబూబాబాద్‌ జిల్లాలో 2,22,550 ఇళ్లకు గాను 4,732 మందికి జ్వరాలున్నట్టు నిర్ధారణ అయింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా రంగశాయిపేట, ఖిలా వరంగల్, పెద్దమ్మగడ్డ, దేశాయ్‌పేట, కీర్తినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పరిధిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండగా, రూరల్‌ ప్రాంతంలోని కమలాపూర్, ఐనవోలు, కడిపికొండలో కూడా అధిక సంఖ్యలో లక్షణాలున్నవారు తేలారు.   

పాలమూరులో.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో 10,84,669 ఇళ్లకు గాను జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న 25,467 మందికి మెడికల్‌ కిట్లు అందజేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధి కంగా 10,959 మందికి, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 3,120 మందికి లక్షణాలు ఉన్నట్టు తేలింది. నాగర్‌ కర్నూలు జిల్లాలో 4,089, వనపర్తి జిల్లాలో 4,058, జోగులాంబ గద్వాల జిల్లాలో 3,241 మంది లక్షణాలతో బాధపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంతోపాటు జడ్చర్ల, దేవరక ద్ర, గండీడ్, రాజాపూర్, అడ్డాకుల, మూసాపేటలో ఎక్కువగా కేసులు నమోదు కావడం గమనార్హం.  

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 15,637 మందికి జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్నాయని తేలింది. ఖమ్మం జిల్లాలో 4,57,504 ఇళ్లను వైద్య బృందాలు సందర్శించగా, అందులో 8,411 మందికి లక్షణాలున్నాయని తేలింది. జిల్లాలోని పెనుబల్లి మండలంలో  అత్యధికంగా 1,290 మందికి లక్షణాలున్నట్టు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.91 లక్షల జనాభాకు గాను 3,02,918 ఇళ్లను వైద్య బృందాలు సందర్శించగా, అందులో 7,226 మందికి లక్షణాలున్నాయని గుర్తించారు. పాల్వంచ మున్సిపాలిటీలో  అత్య ధికంగా 693 మందికి లక్షణాలు కనిపించాయి. 

ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లో.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని 7.46 లక్షలకు పైగా ఇళ్లకు గాను 7,41,571 ఇళ్లలో సర్వే నిర్వహించగా, అందులో 27,613 మందికి జ్వర లక్షణాలను గుర్తించారు. గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్‌ జిల్లాలో 9 వేల మందికి జ్వర లక్షణాలు గుర్తించారు. మంచిర్యాల జిల్లా పరిధిలో అత్యధికంగా లక్సెట్టిపేట అర్బన్‌ పీహెచ్‌సీలో 616 మందికి లక్షణాలు కనిపించాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 7,56,614 ఇళ్లలో సర్వే నిర్వహించగా, మొత్తం 27,857 మందికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. మెదక్‌ జిల్లాలో 7,453 మందికి , సంగారెడ్డి జిల్లాలో 9,786 మందికి, సిద్దిపేట జిల్లాలో 10,618 మందికి కరోనా లక్షణాలున్నట్టు తేలింది.  

కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 9,18,285 కుటుంబాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 23,335 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18,548 హోం ఐసోలేషన్‌లో ఉండగా, 1,805 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10,71,439 కుటుంబాలను సర్వే చేయగా 20,178 మంది జ్వరం, జలుబు సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 9,663 మందికి, సూర్యాపేట జిల్లాలో 4,260 మందికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,255 మందికి లక్షణాలున్నా యని తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం జనాభా 7.96 లక్షలు కాగా, 2,10,333 ఇళ్లల్లో సర్వే పూర్తయింది. 6,255 మందికి కోవిడ్‌ లక్షణాలు గుర్తించి కిట్లు అందజేశారు. 

నిజామాబాద్‌ జిల్లాలో...
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 12,873 మందికి జ్వర లక్షణాలున్నాయని తేలింది. ప్రస్తుత నిజామా బాద్‌ జిల్లాలో 4,07,589 ఇళ్లను సర్వే చేయగా, 8,1690 మందికి, కామారెడ్డిలో 2,57,863 ఇళ్లను సర్వే చేయగా 4,713 మందికి జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు గుర్తించారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలోని 317 ఆస్పత్రుల్లో 1,97,037 మందిని పరీక్షించగా 30,991 మందికి  తీవ్ర జ్వరంతోపాటు కోవిడ్‌ సంబంధిత లక్షణాలున్నాయి. ఇంటింటి సర్వేలో 6,96,366 మందిని పరీక్షించగా 19,671 మందికి కోవిడ్‌ లక్షణాలున్నాయని తేలింది. 

లక్షణాలున్నవారు లక్షల్లోనే.. 
ఈ నెలలో చేపట్టిన ఇంటింటి సర్వేలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబా లను వైద్య బృందాలు సందర్శించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 48 వేలకు పైగా కరోనా బాధితులుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 2,36,982 మందికి కరోనా నిర్ధారణ కాకపోయినా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు లాంటి కోవిడ్‌ లక్షణాలున్నాయని తేలింది. గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ సర్వే ఓ కొలిక్కి వస్తోందని వైద్య అధికారులు చెబుతుండగా, ‘సాక్షి’ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం ప్రతి ఉమ్మడి జిల్లాలో సగటున 20 వేల మంది కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని తేలింది. 

ఇలా సర్వే .. అలా ఆసరా
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో, ఆ తర్వాత 3 రోజులకు అంటే 6 నుంచి మిగిలిన జిల్లాల్లో ఫీవర్‌ సర్వే ప్రారం భమయింది. ఈ సర్వేలో ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి ఇంట్లో ఎవరికయినా జ్వరమొచ్చిందా.. దగ్గు ఉందా? అని తెలుసు కుంటున్నారు. లక్షణాలున్న వారి పేర్లు నమో దు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మందులు తీసుకువచ్చి ఇస్తున్నారు. ఏ మందు ఎలా వాడాలో చెబుతున్నారు. రోజూ 3 సార్లు బాధి తులకు ఫోన్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వైద్య బృందాల్లో అంగన్‌వాడీ కార్యకర్త, ఆశ వర్కర్, ఏఎన్‌ఎం, ఇతర వైద్య సిబ్బంది ఉంటున్నారు. 

లక్షణాలు బాగా బయటపడుతున్నాయి
రాజాపేట మండల కేంద్రంలో ఎక్కువ శాతం ప్రజలు జలుబు, దగ్గు, ఫీవర్‌ వంటి లక్షణాలు చెబుతున్నారు. మరి కొంతమంది మాత్రం వీటితోపాటు వంటినొప్పులు ఉన్నాయని చెప్పారు.  కొందరు లక్షణాలున్నా లేవని చెబుతున్నారు. వారు మందులు వాడుతున్నట్లు మాకు తెలిసింది. అటువంటి వారిని గుర్తించి కరోనా పరీక్షకు పంపాము. కొందరికి పాజిటివ్‌గా కూడా తేలింది. -కొత్త కృష్ణలీల, ఆశ కార్యకర్త, రాజాపేట, యాదాద్రి భువనగిరి

70% ప్రజలకు ఆరోగ్య సమస్యలున్నాయి
దాదాపుగా 70 శాతం ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు చెబుతున్నారు. ముఖ్యంగా ఒంటినొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లు తేలింది. కొందరైతే మేము ఊళ్లోకి వెళ్లగానే, అడగకముందే వారి అనారోగ్య సమస్యలను చెబుతున్నారు. వారికి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌ చేస్తున్నాం.
-రావుల సంతోష, ఆశ కార్యకర్త, భూదాన్‌పోచంపల్లి, యాదాద్రి భువనగిరి 

నిజాలు దాస్తున్నారు
కొంతమంది నిజాలు దాస్తున్నారు. మేముæ సర్వేకు వెళ్లినప్పుడు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా బాగానే ఉన్నామం టున్నారు. మాకు ఏ జబ్బులూ లేవంటున్నారు. మీ ద్వారానే మాకు కరోనా వస్తదని, మా ఇళ్లకు రావొద్దని అంటున్నారు. ఇంకొందరు ఇళ్లలోనే ఉండి తలుపులు వేసుకొని తట్టినా తీయడం లేదు. మొత్తం మీద జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు.
-కొమ్ము నాగరాజు, పంచాయతీ కార్యదర్శి, అర్వపల్లి, సూర్యాపేట జిల్లా 

జ్వరపీడితులే అధికం
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి రికార్డు చేశాం. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. 15 పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి మందులు ఇచ్చాం. ప్రతిరోజూ వెళ్లి పల్స్‌ ఆక్సీమీటర్, ఉష్ణోగ్రతను కొలిచే సాధనంతో పరీక్షలు చేసి తగిన సూచనలు చేస్తున్నాం.
-కాళేశ్వరి, ఆశ వర్కర్, కురవి, మహబూబాబాద్‌ జిల్లా 

బయట తిరగకుండా చూస్తున్నాం..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వేలో భాగంగా ఆశ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతున్నాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. ఎవరైతే కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతున్నారో తెలుసుకుని ఆ ఇంటికి మార్కింగ్‌ చేస్తున్నాం. అత్యవసరమైతే ఆస్పత్రుల్లో జాయిన్‌ చేస్తున్నాం. లక్షణాలున్న మిగతావారికి మందులు ఇచ్చి ఐసోలేషన్‌ లో ఉండాలని చెబుతున్నాం. పంచాయతీ సిబ్బంది వారిపై ఎప్పుడూ కన్ను వేసి ఉంచుతున్నారు. వారు బయట తిరగకుండా చూడడంతో పాటు వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
 -వెంకటయ్యగౌడ్, పంచాయతీ కార్యదర్శి, రాంచంద్రపూర్, మహబూబ్‌నగర్‌

10 ఇళ్లు సర్వే చేస్తే.. మూడిళ్లలో లక్షణాలు
గ్రామాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగు తున్నాయి. 10 ఇళ్లు సర్వే చేస్తే మూడిళ్లలో వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. లక్షణాలు ఉంటే కిట్‌లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. పాజిటివ్‌ వచ్చినవారు కూడా తమ ఇంటికి వస్తే ఇతరులకు తెలుస్తుందని రానివ్వ డం లేదు. ఇదేంటని అడిగితే దూషించిన సందర్భాలూ ఉన్నాయి. మా ప్రాణాలను లెక్కచేయకుండా ఎండలో తిరుగుతూ సర్వే చేస్తున్నాం. ప్రజలు కరోనాపై అవగాహన తెచ్చుకుని, స్వీయ నియంత్రణ పాటిస్తేనే వైరస్‌ కట్టడి సాధ్యపడుతుంది. 
– శ్రీలత, ఆశ కార్యకర్త, ఇందుర్తి, కరీంనగర్‌

  • ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం వరకు రాష్ట్రంలో 48,110 కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులున్నాయి.
  • ఇంటింటి సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 2,36,982 మందికి కరోనా నిర్ధారణ కాకపోయినా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు లాంటి కోవిడ్‌ లక్షణాలున్నాయని తేలింది.
  • ఇప్పుడు గ్రామీణ ప్రజలు కూడా వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తన రూపాన్ని కరోనా వైరస్‌ మార్చుకోవడంతో పట్టణాలతో పాటు పల్లెలు కూడా వణికిపోతున్నాయి.
  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 12,873 మందికి, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 50,662 మందికి జ్వరం తదితర కోవిడ్‌ లక్షణాలు కనిపించాయి. 
మరిన్ని వార్తలు