Secunderabad Protests: పది మందిని చర్చలకు పిలిచిన పోలీసులు.. అంతా వస్తామని ఆందోళనకారులు

17 Jun, 2022 15:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిపథ్‌ అలజడితో సికింద్రాబాద్‌ యుద్ధభూమిని తలపిస్తోంది. వేలమంది ఆందోళనకారులు(అభ్యర్థులు కూడా) ఇంకా పట్టాలపైనే బైఠాయించారు. అయితే వాళ్లతో చర్చించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ తరుణంలో నిరసనకారులు మాత్రం తగ్గడం లేదు.

ఈ మేరకు.. ఆందోళనకారుల్ని పోలీసులు చర్చలకు పిలిచారు. అయితే కేవలం పది మందిని మాత్రమే చర్చలకు ARO ఆఫీస్‌కు రావాలని పోలీసులు ఆహ్వానం పంపారు. అయితే ఆందోళనకారులు మాత్రం పట్టాలపైనే కూర్చుంటామని పట్టుబడుతున్నారు. పది మంది కాదు.. అందరం వస్తామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇలాగే ఉంటామని బదులిచ్చారు.

ఆందోళనకారుల్ని స్టేషన్‌ కాలి చేయాలని.. ఇలాగే కూర్చుంటామంటే ఊరుకునేది లేదని, హింసాత్మక ఘటనలకు దిగితే సహించబోమని వార్నింగ్ కూడా ఇచ్చారు‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని, చర్చలకు అరగంట సమయం ఇస్తున్నట్లు తెలిపారాయన.

మరోవైపు అగ్నిపథ్‌ నిరసనల్లో భాగంగా.. సికింద్రాబాద్‌  రైల్వే స్టేషన్‌లో మూడు రైళ్లు, 40కిపైగా బైకులను పట్టాలపై తగలబెట్టారు ఆందోళనకారులు. సికింద్రాబాద్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్ని రైళ్లను మౌలాలిలోనే నిలిపివేశారు. ఇంకొన్నింటిని దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు భీతిల్లిపోతున్నారు. మరికొందరు ప్రయాణాలు రద్దు చేసుకోవడమో, రోడ్డు మార్గాన వెళ్లడమో చేస్తున్నారు.

చదవండి: అగ్నిపథ్‌ నిరసనలు: చాలా దేశాల్లో అమలు అవుతోంది ఇదే!

మరిన్ని వార్తలు