సికింద్రాబాద్‌ కేంద్రంగా కాల్‌ సెంటర్‌ స్కామ్‌

19 Oct, 2021 06:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విదేశీయులనే టార్గెట్‌ చేసిన అంతరాష్ట్ర ముఠా 

పన్ను బకాయిల పేరుతో వారికి వీఓఐపీ కాల్స్‌ 

అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాతో పాటు ఇంగ్లాడ్, ఐర్లాండ్‌ దేశాల్లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని, సికింద్రాబాద్‌ కేంద్రంగా సాగుతున్న కాల్‌ సెంటర్‌ స్కామ్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. సోమవారం రాత్రి సదరు బోగస్‌ కాల్‌ సెంటర్‌పై దాడి చేసిన ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆయా దేశాలకు చెందిన కొన్ని వందల మంది వీళ్లు ట్యాక్సులు, క్రిమినల్‌ కేసుల పేరుతో బెదిరించి భారీగా డబ్బు గుంజినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే నిందితులను లోతుగా విచారిస్తున్న అధికారులు పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నగరవాసులతో కూడిన ఓ అంతరాష్ట్ర ముఠా సికింద్రాబాద్‌లో ఈ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది.

వీళ్లు వివిధ మార్గాల్లో అమెరికా, ఇంగ్లాడ్, ఐర్లాండ్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివరాలు సేకరించారు. వారికి ఈ కాల్‌ సెంటర్‌ నుంచి టెలికాలర్స్‌ ద్వారా వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (వీఓఐపీ) విధానంలో వారికి కాల్స్‌ చేయిస్తోంది. తాము రెవెన్యూ, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన అధికారులుగా పరిచయం చేసుకుంటోంది. ఫలానా లావాదేవీలకు సంబంధించి పన్ను బకాయి ఉన్నారంటూ వారిని బెదిరిస్తోంది. ఆ మొత్తం పెనాల్టీతో సహా చెల్లించకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బెదరగొడుతున్నారు.  

చదవండి: (Hyderabad: అమ్ముతావా.. చస్తావా!)

అక్కడి వారితో ఒప్పందాలు.. 
ఆయా దేశాల్లో రెవెన్యూ, కస్టమ్స్‌ విభాగాలకు సంబంధించిన కేసులు కఠినంగా ఉండటం వీరికి కలిసి వచ్చింది. ఈ కాల్స్‌కు భయపడిన ఆయా దేశీయులు సెటిల్‌ చేసుకుంటూ కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తున్నారు.  
వీరితో డబ్బు బదిలీ చేయించుకోవడానికి అక్కడే ఉంటున్న వారితో ఒప్పందాలు చేసుకున్న కాల్‌ సెంటర్‌ నిర్వాహకులు వారి అకౌంట్‌ నెంబర్లు ఇస్తున్నారు.  
ఇలా ఇప్పటికే వందల మంది నుంచి భారీ మొత్తాలు ఆయా బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి. ఈ మొత్తంలో తమ కమీషన్‌ మిగుల్చుకుంటున్న ఖాతాదారులు మిగిలింది హవాలా మార్గంలో ఇక్కడి సూత్రధారులకు పంపుతున్నారు.  
దీనిపై అమెరికన్‌ కాన్సులేట్‌కు సమాచారం అందింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బేగంపేట, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి కాల్‌ సెంటర్‌పై దాడి చేశారు.  
కొందరు టెలీకాలర్లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు  వేట ముమ్మరం చేశారు.  
ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ చేయనున్నారు. నిందితుల అరెస్టును నేడోరేపో నగర పోలీసు కమిషనర్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు