కిడ్నాప్‌ కేసు.. అఖిల ప్రియకు ఎదురుదెబ్బ

11 Jan, 2021 12:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. అయితే వైద్యులు న్యాయస్థానానికి సమర్పించిన వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది. కిడ్నాపు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదన విన్న కోర్టు.. అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి అఖిల ప్రియ 13వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీలో ఉండనున్నారు. కాగా బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉండగా.. కిడ్నాప్ కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు కిడ్నాప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌తో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వారిద్దరి కోసం మూడు రాష్ట్రా‍ల్లో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: గుంటూరు శ్రీను నేర చరిత్రపై ఆరా..

మరిన్ని వార్తలు