డిసెంబర్‌లోనే స్కెచ్‌ వేశారు!

19 Jan, 2021 02:20 IST|Sakshi

అనివార్య కారణాలతో కిడ్నాప్‌ ప్లాన్‌ వాయిదా

బాధితుల ఇంట్లో డాక్యుమెంట్స్‌ కోసం వెతుకులాట

అదనపు సెక్షన్‌ జోడించిన దర్యాప్తు అధికారులు

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ రిటర్న్‌ చేసిన కోర్టు

సాక్షి, హైదరాబాద్‌: హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు తదితరుల్ని కిడ్నాప్‌ చేసేందుకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ డిసెంబర్‌లోనే స్కెచ్‌ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఈ నెల మొదటి వారానికి వాయిదా పడింది. మరోపక్క కిడ్నాప్‌ చేసే సమయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోవడానికి భార్గవ్‌ విశ్వప్రయత్నం చేశాడు. ఈ కేసులో బందిపోటు అభియోగాలను కూడా పోలీసులు చేరుస్తూ సోమవారం సికింద్రాబాద్‌ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ తరహా నేరాలకు సంబంధించిన పిటిషన్లను నాంపల్లి సెషన్స్‌ కోర్టు మాత్రమే విచారించాల్సి ఉండటంతో అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు రిటర్న్‌ చేసింది.

స్కెచ్‌ ఇలా వేశారు..
హఫీజ్‌పేటలోని భూమిని చేజిక్కించుకోవడానికి ప్రవీణ్‌రావు తదితరులను కిడ్నాప్‌ చేయడమే మార్గమని అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ గత నెల నిర్ణయించుకున్నారు. గుంటూరు శ్రీను ద్వారా మాదాల సిద్ధార్థ్‌కు సమాచారం ఇచ్చి కొందరు అనుచరులతో రావాలని చెప్పారు. దాదాపు 10 మందిని వెంట తీసుకుని డిసెంబర్‌ 25న హైదరాబాద్‌కు సిద్ధార్థ్‌ చేరుకున్నాడు. వారికి శివార్లలోని ఓ లాడ్జిలో బస కల్పించిన భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు కుట్ర అమలుకు ఆలస్యమవు తుందని, డిసెంబర్‌ 31 తర్వాత అమలు చేద్దామని చెప్పి పంపారు. తిరిగి ఈ నెల 2న హైదరాబాద్‌ రావాలని సమాచారం ఇవ్వడంతో సిద్ధార్థ్‌ దాదాపు 25 మందిని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు.

విజయవాడ, పరిసర ప్రాంతాల వారికి ఒకే బస్సులో టికెట్లు బుక్‌ చేశాడు. షేర్ల వ్యాపారానికి సంబంధించి బోయిన్‌పల్లికి చెందిన కొందరు ‘మంత్రి గారిని’(అఖిలప్రియ) మోసం చేయడంతో వారిపై ఐటీ దాడులు చేయిస్తోందని సిద్ధార్థ్‌ తన అనుచరులకు చెప్పాడు. ఆ అధికారులకు మనం సహాయంగా ఉండాలని నమ్మబలికాడు. ఇలా వచ్చిన వారంతా కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో బస చేశారు. కిడ్నాప్‌ చేసే రోజు బాధితుల ఇంటికి వెళ్లకూడదని భార్గవ్‌ రామ్‌ తొలుత భావించాడు. అయితే బాధితులతో బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నా.. హఫీజ్‌పేట స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోకపోతే దాన్ని సొంతం చేసుకోవడం కష్టమవుతుందని అనుకున్నాడు. చదవండి: (ఈవెంట్‌లా కిడ్నాప్‌.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే)

దీంతో కిడ్నాప్‌ రోజు భార్గవ్‌రామ్, అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి కూడా బాధితుల ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను ఓ గదిలో, ముగ్గురు అన్నదమ్ములను హాలులో నిర్బంధించాక వీరిద్దరూ ఇల్లంతా గాలించారు. అయితే ఆ పత్రాలను ప్రవీణ్‌రావు బ్యాంకు లాకర్‌లో ఉంచడంతో అవి దొరకలేదు. ముగ్గురు బాధితులను కిడ్నాప్‌ చేసిన ఈ ముఠా ఇంట్లోని ల్యాప్‌టాప్‌తోపాటు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లింది. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు, ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సికింద్రాబాద్‌ 11వ అదనపు మెట్రో పాలిటన్‌ కోర్టు, కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా బోయిన్‌పల్లి పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు