డెక్కన్‌ మాల్‌కు పగుళ్లు.. బిల్డింగ్‌ వద్ద హైటెన్షన్‌.. ఏ క్షణమైనా కుప్పకూలే ఛాన్స్‌ 

20 Jan, 2023 20:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట డెక్కన్‌ మాల్‌ అగ్నిప్రమాద ఘటనపై నిట్‌ అధికారులు రూపొందించిన నివేదిక పోలీసులకు చేరింది. డ్రోన్‌ కెమెరాతో శుక్రవారం ఉదయం నుంచి భవనం పరిస్థితిని అంచనా వేశారు అధికారులు. అయితే భవనం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

ఈ వివరాలను సెంట్రల్‌జోన్‌ డీసీపీ మీడియాకు వెల్లడించారు. ‘‘బిల్డింగ్‌ ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉందని అధికారులు మాతో చెప్పారు. భవనం మొత్తం ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. పైఅంతస్తు సీలింగ్‌ పూర్తిస్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్‌ మొత్తం బూడిద, శిథిలాలతో నిండిపోయిందని వివరించారు. 

భవనం ముందు భాగంలో రాకపోకలను నిషేధించాం. బిల్డింగ్‌లోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదు. ఇప్పటికే బిల్డింగ్‌లో రెండంతస్తుల స్లాబ్‌లు కూలిపోయాయి. భవనంలో కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీ తెలియదు. ముగ్గురికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. భవనం పరిస్థితిపై యజమానికి పూర్తి సమాచారం ఇచ్చాం అని డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. డ్రోన్‌ ద్వారా రెండు మృతదేహాలను గుర్తించినట్లు వార్తలు బయటకు వచ్చినప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కాకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు