Secunderabad Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్‌ ఆపరేషన్‌

21 Jan, 2023 08:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మినిస్టర్స్‌ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్‌ కార్పొరేట్‌ అగ్నిప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ శుక్రవారం కూడా లభించలేదు. భవనంలోకి అడుగుపెట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో విక్టిమ్‌ లోకేషన్‌ కెమెరాతో (వీఎల్‌సీ) కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేస్తున్నారు.

రాధా ఆర్కేడ్‌లో గల్లంతైన డెక్కన్‌ కార్పొరేట్‌ ఉద్యోగులు జునైద్, వసీం, జహీర్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు  శుక్రవారం ఉదయం ఉపక్రమించారు. వీరి సెల్‌ఫోన్ల లాస్ట్‌ లోకేషన్స్‌ గురువారం ఉదయం భవనం వద్దే ఉండగా...ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. మరోపక్క ప్రమాదానికి కారణాలు విశ్లేషించడానికి క్లూస్‌టీమ్‌ను లోపలకు పంపాలని భావించారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగ, భరించలేని వేడి ప్రతికూలంగా మారాయి. వీటి కారణంగా నేరుగా, లేడర్‌ ద్వారా ప్రయత్నించినా బృందాలు భవనంలోకి అడుగుపెట్టే పరిస్థితి కనిపించలేదు.  

స్పష్టత లేదు... 
ఈ నేపథ్యంలోనే రెండో అంతస్తులో భవనం వెనుక వైపు రెండు చోట్ల మృతదేహాలు ఉన్నట్లు ఆనవాళ్లను శుక్రవారం సాయంత్రం గుర్తించారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించకపోవడంతో ఔనా? కాదా? అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో డ్రోన్‌ కెమెరా చిత్రీకరించిన వీడియోను ఇంప్రొవైజేషన్‌ విధానంలో విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. మొదటి అంతస్తులో కొంత వరకు లోపలికి వెళ్లిన డ్రోన్‌ అక్కడ మెట్ల మార్గం, శ్లాబ్‌ కూలి ఉన్నట్లు గుర్తించింది. భవనం మొత్తం శిథిలాలు, కాలిపోయిన వస్తువులు ఉండటంతో పాటు బూడిద సుమారు రెండు అడుగుల మేర పేరుకుపోయినట్లు గుర్తించారు.

పది గంటలకు పైగా మంటల్లో ఉన్న ఈ ఆరంతస్తుల భవనం స్ట్రక్చరల్‌ స్టెబిలిటీని నిర్థారించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీంతో వరంగల్‌ నిట్‌ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. నిట్‌ డైరెక్టర్‌ రమణ రావు, జీహెచ్‌ఎంసీ అధికారులు క్రేన్‌ సహాయంతో భవనం పై అంతస్తుల వరకు వెళ్లి పరిశీలించి మంటల్లో కాలిపోయిన కొన్ని శిథిలాలను సేకరించారు. భవనం పూర్తిగా బలహీనంగా మారిందని దీన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు చెప్పగలుగుతామని రమణరావు అన్నారు.

బయటే బస్తీల జనం.. 
ఈ భవనాన్ని ఆనుకుని ఉన్న కాచిబోలిలో సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బస్తీలో చాలా ఇళ్లకు శుక్రవారం కూడా తాళాలు కనిపించాయి. భవనం వెనుక ఉన్న ఉత్తమ్‌ టవర్స్‌లో కిమ్స్‌ ఆస్పత్రి నర్సింగ్‌ హాస్టల్‌ ఉంది. ఇక్కడ నుంచి నర్సులను ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని కూల్చిన తర్వాతే చట్టుపక్కల వారికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోపక్క ఈ భవనం కూల్చివేత పనులు ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం దీన్ని పరిశీలించిన ఆ సంస్థ బృందం కూల్చివేత పూర్తి చేయడానికి మూడు–నాలుగు రోజులు పడుతుందని అభిప్రాయపడింది.

గల్లంతైన వారు గుజరాత్‌ నుంచి వలసవచ్చిన వాళ్లు కావడంతో శుక్రవారం ఉదయానికి వారి కుటుంబీకులు నగరానికి చేరుకున్నారు. తమ వారి కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వీరికి రెండు మృతదేహాలు కనిపించాయనే వార్త శరాఘాతమైంది. అవి ఎవరివో, కనిపించని మూడో వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వసీం సోదరుడు ఇమ్రాన్, జునైద్‌ సోదరుడు ఆసిఫ్‌ రోజంతా భవనం ముందే గడిపారు. చీకటి పడటంతో శుక్రవారం రాత్రి సెర్చ్‌ ఆపరేషన్‌ ఆపేసిన అధికారులు శనివారం మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అగ్నిప్రమాదం తీరు తెన్నులు, భవనం లోపలి పరిస్థితులను గమనించిన ఓ పోలీసు అధికారి ‘ఆ ముగ్గురూ బతికే అవకాశాలు లేవు. ఇన్ని గంటల మంటలు, ఇంత వేడి, ఫైర్‌ ఇంజన్లు చల్లిన నీళ్లు..ఇవన్నీ పరిశీలిస్తుంటే వారి ఎముకలు దొరికే అవకాశమూ తక్కువే’ అని వ్యాఖ్యానించారు.

డ్రోన్ల సాయంతో... 
లోపలికి వెళ్లలేక వెనక్కు వచ్చిన టీమ్స్‌ డ్రోన్‌ కెమెరాల సాయం తీసుకోవాలని స్పష్టం చేశాయి. దీంతో అధికారులు ఓ ప్రైవేట్‌ సంస్థను సంప్రదించి వీఎల్‌సీతో కూడిన డ్రోన్లను రప్పించారు. వేడి కారణంగా ఈ డ్రోన్లు సైతం లోపలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. భవనం ముందు భాగంతో పాటు నాలుగు వైపుల నుంచి డ్రోన్‌ ఎగురవేసి అనువైన, ఖాళీగా ఉన్న భాగాల నుంచి లోపలి ప్రాంతాన్ని పరిశీలించారు.  

మరిన్ని వార్తలు