అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా? నగరంలో సరైన ‍అగ్నిమాపక వ్యవస్థ లేదా?

20 Jan, 2023 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా? ప్రమాద సమయంలో కాపాడేందుకు సరైన అగ్నిమాపక వ్యవస్థ నగరంలో అందుబాటులో లేదా?.. అంటే అవుననే నిరూపిస్తున్నాయి అగ్ని ప్రమాద ఘటనలు. సికింద్రాబాద్‌ పరిధిలోని ‘డెక్కన్‌ కార్పొరేట్‌’ గురువారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మంటల తీవ్రత అధికంగా ఉంది. గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించినా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది.

అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో ఫైర్‌ సిబ్బంది స్పందించడం, తగిన పరికరాలతో రంగంలోకి దిగడం అత్యంత ప్రధానమైంది. అలా చేస్తే మంటలను అదుపులోకి తేవడంతోపాటు ప్రమాద తీవ్రత, నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అగ్నిమాపక సిబ్బందికి తగిన సమర్థత ఉంటున్నా.. కొన్నిసార్లు అందుబాటులో సరైన పరికరాలు లేకపోవడంతోనూ వారు ఆశించిన రీతిలో స్పందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీ అధికారుల కాసుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖలోని కొందరు లంచావతారుల కారణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు అలవోకగా లభిస్తున్నాయి. నగరంలో కేవలం రెండంటే రెండు మాత్రమే బ్రాంటో నిచ్చెనలు ఉన్నాయి. బహుళ అంతస్థుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌లో ఈ నిచ్చెలను అంత్యంత కీలకమైనవి.

కింది అంతస్థుల్లో మంటలు, పొగ వ్యాపించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఈ భారీ నిచ్చెనల ద్వారా పై అంతస్తులకు చేరే వీలుంటుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడి వారిని సురక్షితంగా కిందకు చేర్చడంలోనూ ఈ భారీ నిచ్చెనలు ఉపయోగపడాయి. ప్రస్తుతం ఉన్న రెండు బ్రాంటో నిచ్చెనల్లో ఒకటి సికింద్రాబాద్‌ పరిధిలో, మరోటి మాదాపూర్‌ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. 

మంజూరు మంజూరు చేసినా..  
అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న బ్రాంటో నిచ్చెనకు అదనంగా మరో 101 మీటర్ల బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు ప్రభుత్వం మంజూరు లభించింది. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఈ బ్రాంటో స్కై లిఫ్ట్‌నకు  దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే!

మరిన్ని వార్తలు