సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు

14 Sep, 2022 14:09 IST|Sakshi

సర్వీసింగ్‌ పాయింట్‌గా ఈ– బైక్‌ షోరూం

అరకొర విస్తీర్ణంలో రూబీ లాడ్జీ భవన నిర్మాణం

మీటర్‌ వెడల్పు కూడా లేని ఇంటర్నల్‌ స్టెయిర్‌ కేస్‌

తగినంత సంఖ్యలో లేని ఎమర్జెన్సీ లైట్లు

అగ్నిమాపక సిబ్బందికి కొరవడిన ప్రత్యేక లిఫ్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్‌ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంది. ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. 


ఉల్లంఘనలు ఇలా..   

► భవనం సెల్లార్, గ్రౌండ్‌ ప్లస్‌ ఫోర్‌తో పాటు పెంట్‌ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్‌ షోరూమ్, సర్వీసింగ్‌ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్‌ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు.  


► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్‌ కేస్‌ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్‌ స్టెయిర్‌ కేస్‌ మీటర్‌ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్‌ ఉండాలి.  భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్‌ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్‌ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్‌ కేస్‌ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు.   


► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, వాటర్‌ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్‌ రైజర్‌ తప్పనిసరి. ఇందులో వాటర్‌ పైపులు, స్ప్రింక్లర్స్‌ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్‌ ఫైర్‌ అలారం, మాన్యువల్‌ ఫైర్‌ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్‌ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ 
అధికారులు చెబుతున్నారు.  


► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంక్, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ తప్పనిసరి. ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. 


నిప్పుల్లో నిబంధనలు

అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది.  ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్‌ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. 


జీహెచ్‌ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్‌ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. 


ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..)

మరిన్ని వార్తలు