అవయవ మార్పిడి నోడల్‌ సెంటర్‌గా గాంధీ ఆస్పత్రి

27 Jun, 2022 18:30 IST|Sakshi

తొమ్మిది ఆధునిక మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అవయవాల మార్పిడి సర్జరీల నోడల్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. అత్యాధునిక మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటుకు రూ. 30 కోట్ల నిధులు కేటాయించగా, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డిటెల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌)కు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ఓకే చెప్పారని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు. 

ప్రభుత్వ సెక్టార్‌లో ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఒకటి రెండు అవయవమార్పిడి సర్జరీలు విజయవంతంగా చేపట్టినప్పటికీ అవసరమైన ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అవయవ మార్పిడిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. గాంధీలోఅవయవ మార్పిడి ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 

రోబోటిక్‌తోపాటు హైఎండ్‌ మాడ్యులర్‌ థియేటర్లు..
ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్తులో రోబోటిక్‌ థియేటర్‌తోపాటు గుండె, మూత్రపిండాలు, కాలేయం, కాక్లియర్, కీళ్లమార్పిడి తదితర తొమ్మిది హైఎండ్‌ మాడ్యులర్‌ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. బాక్టీరియా, వైరస్‌ థియేటర్లతోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని ఉస్మానియా నుంచి గాంధీకి తరలించేందుకు సన్నాహాలు చేపట్టారు.  అంతేకాక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గాంధీఆస్పత్రిని దేశంలోనే అత్యన్నతంగా తీర్చిదిద్ధుతామని గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు.  (క్లిక్‌: రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన)

మరిన్ని వార్తలు