సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత

21 Oct, 2022 15:14 IST|Sakshi

అవయవ మార్పిడి నోడల్‌ సెంటర్‌గా గాంధీ ఆస్పత్రి

రోబోటిక్‌తో పాటు ఆరు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు

ఆరు నెలల్లో అందుబాటులోకి.. 

సికింద్రాబాద్‌: గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సాధించనుంది. అవయవ మార్పిడి నోడల్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపు, టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో ఆరునెలల్లో అత్యాధునిక హైఎండ్‌ మాడ్యులర్‌ ఆపరేషన్‌ ధియేటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, తుంటి ఎముక, మోకాళ్లు వంటి అవయవ మార్పిడి, మూగ, చెవుడు, వినికిడిలోపం గల చిన్నారులకు కాక్లియర్‌ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లను గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్థులో నిర్మించనున్నారు.

గాంధీలో చికిత్స పొందుతున్న రోగికి ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి ఆపరేషన్‌ నిర్వహించేందుకు ప్రత్యేకంగా రోబోటిక్‌ సర్జరీ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. గాంధీలో అవయవ మార్పిడి థియేటర్ల కోసం ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వైద్య మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో సాకారం అయ్యేదిశగా ముందడుగు పడింది.
  
► గాంధీఆస్పత్రి 8వ అంతస్తులో అందుబాటులో ఉన్న సుమారు లక్ష చదరపు అడుగుల వైశాల్యంలో రూ.35 కోట్ల వ్యయంతో ఆరు హైఎండ్‌ మాడ్యులర్‌ థియేటర్లను నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న నర్సింగ్‌ స్కూలు, హాస్టల్, నర్సింగ్, నన్‌ సిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ఇతర ప్రదేశాలకు 
తరలించారు.  

► అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ ఆపరేషన్‌ థియేటర్లు ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ నూటికి నూరుశాతం ఉండటంతో సర్జరీల సక్సెస్‌ రేట్‌ పెరుగుతుంది. ఆపరేషన్‌ థియేటర్‌లోని గాలిని పరిశుభ్రం చేసేందుకు లామినార్‌ ఫ్లో, వైరస్, బాక్టీరియాలను నాశనం చేసేందుకు హెఫాఫిల్టర్స్‌ను వినియోగిస్తారు.  

► మాడ్యులర్‌ థియేటర్లకు అనుసంధానంగా ఐసీయు, స్టెప్‌డౌన్‌ వార్డులు, రోగులను సిద్ధం చేసేందుకు కౌన్సిలింగ్‌ విభాగం, సర్జరీ అనంతరం పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేస్తారు. నిష్ణాతులైన వైద్య, నర్సింగ్‌ సిబ్బందిని నియమిస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.  

► ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో కొనసాగుతున్న సర్జికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని గాంధీకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రోబోటిక్‌ సర్జరీలు నిర్వహించేందుకు సంబంధిత వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. 

► ‘హైఎండ్‌ మాడ్యులర్‌ ధియేటర్ల  టెండర్ల ప్రక్రియ కొలిక్కివచ్చింది. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ నేతృత్వంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రోబోటిక్, మాడ్యులర్‌ థియేటర్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్జరీలు చేయడం, వీక్షించే అవకాశం కలుగుతుంది’ అని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. (క్లిక్‌: Omicron BF.7 ముంచుకొస్తున్న నాలుగో వేవ్‌?!)

మరిన్ని వార్తలు