అంతా నిరుపేద కుటుంబాల వారే...

21 Jun, 2022 01:04 IST|Sakshi
జైలు వద్ద కుమారులతో ములాఖత్‌కు వచ్చిన తల్లిదండ్రులు 

28 మంది నిందితులతో తల్లిదండ్రుల ములాఖత్‌

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం కేసులో అరెస్టు అయిన 45 మంది నిందితుల్లో దాదాపు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని జైలు అధికారులు చెప్తున్నారు. సోమవారం 28 మంది నిందితుల తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చి ములాఖత్‌ ద్వారా తమ కుమారులను కలిశారు. నిందితుల్లో ఒకరు సింగరేణి ఉద్యోగి కుమారుడు కాగా, మరొకరు ఆర్టీసీ ఉద్యోగి కుమారుడని గుర్తించారు.

ఈ ఇద్దరూ మినహా మిగిలిన 26 మంది నిందితులూ బెయిల్‌ కోసం న్యాయవాదుల ఖర్చులు కూడా భరించలేరని పేద కుటుంబాలకు చెందిన వారని అంటున్నారు. తమ కుమారులు ఇలాంటి ఆందోళన, విధ్వంసం చేయడానికి సికింద్రాబాద్‌ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని, కోచింగ్‌ కోసం వెళ్తున్నట్లు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

అమాయకులను అరెస్టు చేశారు 
శుక్రవారం గణేష్‌ ఎక్కడకు వెళ్లాడో మాకు తెలీదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. రాత్రి 11 గంటలకు ఎస్సై ఫోన్‌ చేసి బాబు మా దగ్గర ఉన్నాడని, అతడి ఆధార్‌ నంబర్‌ పంపమని చెప్పారు. ఎక్కడ ఉన్నాడని అడిగితే సికింద్రాబాద్‌ కేసులో పట్టుకున్నామన్నారు. మా బాబు రైల్వేస్టేషన్‌ గోడ అవతలే ఉన్నాడు.

అయినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితులు దొరక్కపోవడంతో వాళ్ల ఉద్యోగాల కోసం పోలీసులు అమాయకుల్ని అరెస్టు చేశారు. ములాఖత్‌లో కలిసినప్పుడు మా అబ్బా యి ఇదే చెప్తున్నాడు. మేము స్టేషన్‌లోకి వెళ్లలేదు... స్టేషన్‌ గోడ అవతలే పట్టుకుని అరెస్టు చేశారని ఏడుస్తున్నాడు.      
– అంజయ్య కసారాం, నిందితుడు గణేష్‌ తండ్రి, సంగారెడ్డి జిల్లా 

లాయర్‌ని మాట్లాడుకోవడానికి డబ్బుల్లేవ్‌ 
మా పిల్లలు చేయని నేరానికి జైలు పాలయ్యారు. లాయర్‌ని మాట్లాడుకోవడానికీ డబ్బులు లేవు. దయచేసి మా పిల్లల్ని బెయిల్‌ మీద బయటకు తీసుకురావాలని చేతులెత్తి మొక్కుతున్నా. మా పిల్లలను కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విన్నవించుకుంటున్నా. ఇప్పటికే జైలు పాలైన వారి జీవితం నాశనమైంది.

మహేందర్‌ అరెస్టు విషయం తెలిసి మూడు రోజుల క్రితం ఊరి నుంచి రూ.2 వేలు తెచ్చా. ఇప్పుడు ఖర్చులకూ డబ్బుల్లేవు. దీంతో బస్టాండులో పడుకుంటున్నా. ఆర్మీలో చేరాలనేది మా వాడి ఐదేళ్ల కల. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. విద్యార్థుల వల్లే వచ్చిన తెలంగాణలో వాళ్లే జైలు పాలవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఆర్మీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నారు. 
– సాయప్ప, నిందితుడు మహేందర్‌ మామ, రాంపూర్‌ గ్రామం, తాండూరు   

మరిన్ని వార్తలు