మార్కెట్లలో పీఎఫ్‌ గోల్‌మాల్‌

13 Feb, 2022 04:44 IST|Sakshi

సెక్యూరిటీ గార్డుల భవిష్యనిధిని స్వాహా చేసిన ఏజెన్సీ

బాధ్యులపై చర్యలకు సిద్ధమైన మార్కెటింగ్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: మార్కెటింగ్‌ శాఖలో పనిచేసే సెక్యూరిటీ గార్డుల భవిష్యనిధి (పీఎఫ్‌)కి ఓ ఔట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఎసరుపెట్టింది. పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్మును జమ చేయకుండా స్వాహా చేసింది. కొత్తపేట పండ్ల మార్కెట్‌లో వెలుగు చూసిన ఈ అక్రమాలపై మార్కెటింగ్‌ శాఖ విచారణకు ఆదేశించింది. అయితే, పీఎఫ్‌ స్వాహా వ్యవహారం కేవలం కొత్తపేట మార్కెట్‌కే పరిమితం కాలేదని.. పదుల సంఖ్యలో ఇతర మార్కెట్లలో కూడా ఈ తతంగం జరిగినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు సెక్యూరిటీ ఏజెన్సీపై చర్యలకు ఉపక్రమించారు. నెలనెలా తమ ఖాతాలో జమ కావాల్సిన పీఎఫ్‌ సొమ్ము జమ కాకపోవడం, జనవరి వేతనం కూడా రాకపోవడంతో పలువురు సెక్యూరిటీ గార్డులు మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. 

పీఎఫ్‌ విభాగం లేఖలు రాసినా..
భవిష్య నిధి బకాయిలపై పీఎఫ్‌ విభాగం పలుమార్లు ఆయా మార్కెట్ల కార్యదర్శులకు లేఖలు రాసింది. ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్‌ జమ చేయనందున సెక్యూరిటీ ఏజెన్సీకి నిధుల చెల్లింపులను నిలిపివేయాలని సూచిం చింది. అయితే, ఈ లేఖలను ఖాతరు చేయని కార్యదర్శులు.. ఏజెన్సీపై చర్యలు తీసుకోక పోగా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించారు. తాజాగా సెక్యూరిటీ ఉద్యోగుల ఫిర్యాదుతో మార్కెటింగ్‌ శాఖ పీఎఫ్‌ అధికారులను సంప్ర దించగా.. ఈ విషయం బహిర్గతమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న మార్కెట్లలోని వందల సంఖ్యలో గార్డులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము జమ కావడంలేదని తేలింది. దీంతో విచారణకు ఆదేశించిన మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌.. ఈ అవినీతికి బాధ్యులైన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, కొత్తపేట పండ్ల మార్కెట్‌ కార్యదర్శి దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా, కార్యదర్శి సెలవులో వెళ్లిపోవడంతో గ్రేడ్‌–1 కార్యదర్శి చిలుక నరసింహారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు