నెలకావట్టే.. నేల చదునాయే! మేఘమా.. మరువకే!

28 Jun, 2022 17:31 IST|Sakshi
మోటాపురంలో పత్తి విత్తనాలు విత్తుతున్న కూలీలు

నేలకొండపల్లి (ఖమ్మం): వానాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. వరుణుడి రాక కోసం రైతన్న ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. ఇంకా పెద్ద వర్షం రాకపోదా.. అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజూ మేఘాలు ఊరిస్తున్నప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిస్థాయిలో విత్తనాలు విత్తేందుకు సరిపడా వర్షాలు కురవడం లేదు.

రైతులు ఇప్పటికే ఏదో ఒక చోట దొరికిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం వరకు రెండు, మూడు దఫాలు వర్షాలు కురిస్తేనే పూర్తిస్థాయిలో విత్తనాలు వేసుకునేందుకు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోవటమే మేలని పేర్కొంటున్నారు.

తప్పని ఎదురుచూపులు..
సాధారణంగా వరుణుడు ముందస్తుగా కురిస్తే రోహిణిలో లేదంటే మృగశిర కార్తెలో వానాకాలం ప్రారంభమవుతుంది. సీజన్‌ ప్రారంభమై నెల రోజులవుతున్నా పాలేరు డివిజన్‌లో 10 శాతం విత్తనాలు కూడా విత్తుకోలేదు. దీంతో పెసర, మినుము విత్తుకోవటమే మేలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయినా కొందరు ధైర్యం చేసి విత్తనాలు విత్తుకోగా, మరికొందరు ఇళ్లలోనే పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. విత్తుకున్న విత్తనాలు సైతం ఇంకా మొలకెత్తలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తుకున్న వారు.., విత్తుకోవాల్సిన వారి చూపులు ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. 

ఆగిన సబ్సిడీ పథకాలు..
గతంలో వ్యవసాయ యాంత్రీకరణ యంత్రలక్ష్మి పథకాలు కింద ట్రాక్టర్లు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, పిచికారీ యంత్రాలు తదితర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా వాటిని ఇవ్వకపోవడంతో రైతులు పూర్తి ధరలు చెల్లించి మార్కెట్‌లో కొనుగోలు చేసుకుంటున్నారు. నిధులు కోసం ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరు కావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు కూడా అందుబాటులో లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు