అసెంబ్లీలో డబ్బా కొట్టుకోవద్దు..

30 Sep, 2020 10:57 IST|Sakshi
బాలిక కుటుంబీకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క తదితరులు

సాక్షి, రాజేంద్రనగర్‌: మహిళలకు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడం కాదు.. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు  బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌సాగర్‌లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక సోదరి రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ గ్రీన్‌ సిటీలో ఆశ్రమం పొందుతుండటంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య )

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరుపేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లుతోపాటు ఆర్థిక సహాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మృతురాలి సోదరికి ఉన్నత చదువుతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై జిల్లా మంత్రితోపాటు హోంమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంతోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు టీఆర్‌ఎస్‌ నేత కావడంతో అతడిని  రక్షించేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. మైనార్టీల పక్షాన పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొనే ఓవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

కనీసం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. నిందితుడు టీఆర్‌ఎస్‌ నేత కావడంతో మజ్లిస్‌ మిన్నకుండిపోయిందని విమర్శించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన ఓ సంఘటనపై ట్వీట్‌ చేసిన ఓవైసీ తన ఇంటి పక్కనే మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యం విషయంలో స్పందించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తాము వాస్తవ పరిస్థితిని తెలుసుకునే యత్నం చేస్తుంటే అరెస్టులు చేస్తూ నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క బాలిక సోదరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నేతలు ఇందిరారెడ్డి, శోభన, వర్రి లలిత్‌ ఉన్నారు.   

విచారణ వేగవంతం 
మొయినాబాద్‌(చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపిన పోలీసు ఉన్నతాధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి మొయినాబాద్‌ ఠాణాకు వచ్చారు. నిందితుడు మధుయాదవ్‌ గత పరిస్థితులు, కేసుల వివరాలను తెలుసుకున్నారు. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌కు చెందిన బాత్కు మధుయాదవ్‌ ముందు నుంచి వివాదాస్పదంగా ఉండేవాడు. రియల్‌ వ్యాపారం చేస్తూ పలు భూములను వివాదాస్పదంగా మార్చడంతోపాటు సొంత బంధువులకు చెందిన భూమిని కూడా కబ్జాచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలోనే స్థానిక పోలీసులు అతనిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు.

ఈ వివరాలన్నీ తెసుకున్న డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఘటన జరిగిన గదిలోని ఆనవాళ్లు, బాలిక సోదరి వెల్లడించిన విషయాలతో మధుయాదవ్‌ చేసిన దురాఘతాలపై  తెలుసుకున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన రోజున మొయినాబాద్‌ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపైనా డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే కేసు విచారణాధికారిగా ఇన్‌స్పెక్టర్‌ జానయ్యను తప్పించి రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌చక్రవర్తికి అప్పగించారు. మరిన్ని వివరాల సేకరణ కోసం నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

సీఐపై వేటుకు పెరుగుతున్న డిమాండ్‌  
బాలిక మృతి కేసులో మొయినాబాద్‌ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి తోడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు సైతం ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో హోంమంత్రి మహమూద్‌అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు.  

మరిన్ని వార్తలు