వాహనాల వేలం ఎప్పుడో..?

14 Aug, 2020 11:54 IST|Sakshi
తుప్పుపట్టిపోయిన సీజ్‌ చేసిన వాహనాలు

ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంలో 

తుప్పుపడుతున్న సీజ్‌ చేసిన వాహనాలు 

పట్టించుకోని అధికారులు

ఖిలా వరంగల్‌: ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో రవాణాశాఖ అధికారులు, పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పుపడుతున్నాయి. ఇలాంటి వాహనాలు ఒకటో రెండో ఉన్నాయనుకుంటే పొరపడినట్లే..!. కొన్ని వందల ఆటోలు, ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలు ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంలో తుప్పిపట్టి శిథిలమయ్యాయి. దీంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అయింది. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  

ఆరు నెలల్లో..
వివిధ కారణాలతో పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది సీజ్‌ చేసిన వాహనాలను రవాణాశాఖ సీక్‌ యార్డుకు తరలిస్తారు. వీటిని విడిపించుకోవడానికి యజమానులకు శాఖ నిబంధనల మేరకు ఆరు నెలలు సమయం ఉంటుంది. విడిపించుకోలేకపోతే ఆరు నెలలు తర్వాత ఆయా వాహనాలను వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ అధికారులు ఆ మేరకు వ్యవహరించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో వేలం నిర్వహించిన దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, నాలుగున్నరేళ్లుగా వాహనాలు ఒకేచోట ఉండటంతో తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. సీజ్‌ చేసిన సమయంలో బాగా నడిచిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు వాటిని విక్రయించాలన్నా అమ్ముడుపోని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వేలంలో విక్రయించినా వాటిపై ఉన్న ట్యాక్స్, పెనాల్టీలు, ఇతర జరిమానాలు మొత్తం కలిపిన శాఖకు 50 శాతం కూడా రెవెన్యూ వచ్చేలా లేదు. సకాలంలో వాహనాలను వేలం వేసి ఉంటే పూర్తి సొమ్ము ఖజానాకు జమ అయ్యేదని పలువురు పేర్కొంటున్నారు.  

కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం..
తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు, రోడ్డు టాక్స్‌ చెల్లించని వాహనాలను సీజ్‌ చేసి ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంకు తరలిస్తాం. వాహన యజమానలు ఆరు నెలల్లోపు జరిమానా చెల్లించి విడిపించుకునే వీలుంటుంది. అలా తీసుకోకపోతే వారి చిరునామాకు మూడుసార్లు నోటీసులు పంపుతాం. అయినా స్పందించకపోతే ప్రకటన ద్వారా వాటిని వేలం నిర్వహించి విక్రయిస్తాం. ప్రస్తుతం నాలుగేళ్లలోపు సీజ్‌ చేసిన వాహనాలే కార్యాలయ ప్రాంగణంలో ఉన్నావి. డీటీసీకి నివేదిక అందజేసి శాఖ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించి ఆర్‌సీలు అందజేస్తాం.– కంచి వేణు, ఎంవీఐ, వరంగల్‌ అర్బన్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా