తలనరుక్కుని.. చేతిలో పట్టుకుని.. 

24 Aug, 2022 15:55 IST|Sakshi
అరుదైన ఆత్మాహుతి శిల్పాలు 

సాక్షి, హైదరాబాద్‌: దేవుడిని చేరేందుకు ఆత్మార్పణ చేసుకునే వీరభక్తిని తెలిపే ఆత్మార్పణ శిల్పాలు రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూశాయి. ఆత్మార్పణ శిలలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బయటపడినా.. ఇవి తల నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టుగా ఉన్న అరుదైన శిల్పాలు కావటం విశేషం. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు యాదేశ్వర్‌ దండేకర్‌ వీటిని రాచకొండ గుట్టల్లో గుర్తించారని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ వెల్లడించారు.

జిల్లాలోని మంచాల మండలం లోయపల్లి సోమన్నగుట్ట వద్ద ఐదు ఆత్మాహుతి శిల్పాలు వెలుగు చూశాయని తెలిపారు. వీటిలో వీరులు అంజలిఘటిస్తూ కూర్చుని ఉండగా, వారి కీర్తి ఆచంద్రతారార్కం అని చెప్పేందుకు గుర్తుగా తలపై సూర్య, చంద్రుల చిత్రాలున్న రెండు శిల్పాలున్నాయన్నారు. ఇక తలలు నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టు మరో రెండు శిల్పాలున్నాయని, అందులో ఒకటి ధ్వంసమైందని చెప్పారు. ఇవి చాళుక్యుల శైలిలో ఉన్నాయని, 14–15 శతాబ్దాలకు చెందినవై ఉంటాయని వివరించారు.  

మరిన్ని వార్తలు