సెమిస్టర్‌ పరీక్షలకు ‘వసతి’ గండం!

11 Jul, 2021 00:38 IST|Sakshi

జేఎన్‌టీయూతోపాటు పలు వర్సిటీల్లో సెమిస్టర్‌ పరీక్షలు ఇప్పటికే షురూ 

రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు హాజరవుతున్నవారి సంఖ్య 4.72 లక్షలు 

దూరప్రాంతాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ చార్జీల భారం

సంక్షేమ, ప్రైవేట్‌ హాస్టళ్లు తెరచుకోకపోవడంతో విద్యార్థుల అవస్థలు 

నిజామాబాద్‌ జిల్లా మల్కాపూర్‌కు చెందిన జి.సౌజన్య కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. ఇదివరకు ఇక్కడే ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకోగా, కోవిడ్‌–19 నేపథ్యంలో ఏడాదిగా ఇంటి వద్ద నుంచి ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైంది. ప్రస్తుతం సెమిస్టర్‌ పరీక్షలకు హాజరు కావడానికి రోజు తప్పించి రోజు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. దీంతో రోజుకు సగటున రూ. వెయ్యి ఖర్చవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, సంక్షేమ, కాలేజీ హాస్టళ్లు ఇంకా తెరచుకోకపోవడం, నగరంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వసతి పొందే పరిస్థితి లేకపోవడంతో సౌజన్య తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఆయా సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్న అనేకమంది విద్యార్థులు వసతిలేక సౌజన్య మాదిరిగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు (ఫస్టియర్‌ మినహా) సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. బీటెక్, జనరల్‌ డిగ్రీ విద్యార్థులకు ఈనెలాఖరు వరకు, పీజీ జనరల్, టెక్నికల్‌ కోర్సులు, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆగస్టు రెండోవారం వరకు రోజు తప్పించి రోజు పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే వసతిగృహాల్లో ఉండి చదువు కొనసాగించిన విద్యార్థులు ప్రస్తుతం వసతిలేక ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలతోపాటు మూతపడిన సంక్షేమ, ప్రైవేటు హాస్టళ్లు ఇంకా తెరచుకోలేదు. దీంతో దూరప్రాంతాల్లో ఉండే మెజార్టీ విద్యార్థులు నిత్యం ఇంటి వద్ద నుంచి కాలేజీలకు వచ్చి పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఆయా సెమిస్టర్‌ పరీక్షలకు దాదాపు 4.72 లక్షలమంది హాజరవుతున్నారు. వీరిలో సంక్షేమ వసతిగృహాలు, ప్రైవేటు హాస్టళ్లలో, ప్రత్యేకంగా అద్దె గదుల్లో ఉండి చదువుకున్నవారి సంఖ్య 3 లక్షలు ఉన్నట్లు అంచనా. ఒకవైపు చార్జీలు, మరోవైపు తిండి ఖర్చులు విద్యార్థులకు భారంగా మారాయి.  

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ... 
దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. యూనివర్సిటీ హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లు తెరిస్తే మేలు జరుగుతుందని విద్యార్థులు సూచించినా అధికార యంత్రాంగం స్పందించలేదు. హైదరాబాద్‌కు రెండ్రోజులకోసారి పరీక్షల కోసం వస్తున్నానని, దీంతో పరీక్షలపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నానని కోదాడకు చెందిన ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం విద్యార్థి కె.అవినాశ్‌ నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

రాష్ట్రంలో 5 వేల విద్యార్థి వసతిగృహాలు
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులు వసతి పొందుతున్న హాస్టళ్లు 5 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతిగృహాలున్నాయి. వీటిల్లో పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదివే విద్యార్థుల కోసం వెయ్యి హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో 2 లక్షలకుపైగా విద్యార్థులున్నారు. ప్రైవేటు హాస్టళ్లు దాదాపు మూడువేలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందేవారు.    

మరిన్ని వార్తలు